కరోనా నేపథ్యంలో ఫిలిం మేకర్స్ ఆ దిశగా ఆలోచిస్తారా..?

Update: 2022-01-12 07:30 GMT
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ అనేక కష్టనష్టాలను చవిచూసింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో సినిమాల విడుదలలు వాయిదా పడటంతో నిర్మాతలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత మహమ్మారి కాస్త శాంతించడంతో ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా పుంజుకోవడం కనిపించింది. అయితే మళ్లీ పూర్వవైభవం వస్తుందని సినీ అభిమానులు భావిస్తున్న సమయంలో.. కోవిడ్ థర్డ్ వేవ్ కలకలం రేపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మరియు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు వైరస్ విజృభిస్తోన్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో పాటుగా నైట్ కర్ఫ్యూ విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా థియేటర్లను మూసేసారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలన్నీ మళ్ళీ వాయిదా బాట పట్టాల్సి వచ్చింది.

రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన సినిమాలు.. ఆల్రెడీ రీషెడ్యూల్ కాబడిన చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే సినిమాలను హోల్డ్ లో పెట్టడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. కోవిడ్ ను ఎలాగు పూర్తిగా తరిమి కొట్టలేమని అర్థం అవుతోంది. ఇలాంటి టైంలో థియేటర్లలోనే సినిమాలను రిలీజ్ చేయాలని భీష్మించుకొని కూర్చుంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.

అందుకే గతేడాది మాదిరిగానే చిన్న మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ బాట పట్టించే అవకాశం ఉంది. ఎప్పటిలాగే పెద్ద సినిమాల నిర్మాతలు ఆలోచనలో పడతారు. అయితే థియేటర్లలో విడుదల చేయాలని వేచి చూసే ధోరణి అవలంభించి ఆర్థిక సమస్యలు తెచ్చుకునే కంటే.. ముందుగా డిజిటల్ రిలీజ్ చేసి ఆ తరువాత సినిమా బాగుంటే ఓటీటీ వారే థియేటర్లో విడుదల చేసే పద్ధతి తీసుకొస్తే బాగుంటుందని సినీ ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు. ఈ విధంగా ఓటీటీలతో మాట్లాడుకొని తద్వారా వచ్చిన లాభాన్ని షేర్ చేసుకుంటే ఫైనాన్షియల్ ప్రెజర్స్ నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ లో ప్రయోగత్మకంగా ఈ పద్ధతిని 'బెల్ బాటమ్' సినిమాకు వాడారు. కానీ ఈ చిత్రానికి ఓటీటీలో డివైడ్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు తెలుగులో పలు పెద్ద సినిమాలకు ఈ విధంగా రిలీజ్ చేసుకునే స్కోప్ ఉంది. డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేసినప్పటికీ.. తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేసినా జనాలను రప్పించే క్రేజీ సినిమాలు ఉన్నాయి. మరి నష్టాల నుంచి బయటపడటానికి రాబోయే రోజుల్లో మన మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News