హీరోగా ఆ కమేడియ‌న్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదు, తెలివైన‌వాడే!

Update: 2020-03-18 02:30 GMT
ద‌క్షిణాదిన బోలెడంత మంది క‌మేడియ‌న్లు హీరోలుగా న‌టించారు. ముందుగా క‌మేడియ‌న్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంత‌రం.. చాలా మంది హీరోలుగా అవ‌తారం ఎత్తారు. వారిలో కొంద‌రికి మంచి స‌క్సెస్ లు సొంతం అయ్యాయి కూడా! ఆ సినిమాల స‌బ్జెక్టుల్లో మంచి స‌త్తా ఉండ‌టంతో.. అవి హిట్ అయ్యాయి. ఆ క‌మేడియ‌న్ల‌కు హీరోలుగా విజ‌యాన్ని ఇచ్చాయి.

అయితే కొంద‌రు ఒక్క హిట్ ప‌డ‌గానే.. క‌మేడియ‌న్ వేషాల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇక హీరోగానే కొన‌సాగ‌డం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే అక్క‌డే తేడా కొట్టింది. అలీ, బ్ర‌హ్మానందం వంటి వారికి హీరోలుగా అవ‌కాశం వ‌చ్చినా వారు త‌మ మూలాల‌ను మ‌ర్చిపోలేదు. హీరోలుగా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకుంటూనే, మ‌రోవైపు ఇత‌ర హీరోల సినిమాల్లో కామెడీ వేషాల‌ను కొన‌సాగించారు.

ఎలాగూ వారిని ఎక్కువ సినిమాల్లో ప్రేక్ష‌కులు హీరోలుగా చూడ‌లేదు. వారిని క‌మేడియ‌న్లుగానే చూశారు ప్రేక్ష‌కులు. ఈ విష‌యాన్ని స‌ద‌రు క‌మేడియ‌న్లు కూడా అర్థం చేసుకున్నారు. హీరో వేషాల‌ను ఏదో పార్ట్ టైమ్ గానే చూశారు. అయితే హీరోగా ఒక హిట్టు ప‌డ‌గానే.. మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నించిన సునీల్ లాంటి వారు మాత్రం నెట్టుకురాలేక‌పోయారు.

సునీల్ హీరోగా మారిన స‌మ‌యంలోనే హీరోగా మొద‌లుపెట్టిన త‌మిళ క‌మేడియ‌న్ సంతానం మాత్రం డిఫ‌రెంట్ రూట్లో వెళ్తున్నాడు. ఇత‌డు కూడా అలీ, బహ్మానందం వంటి వారిని అనురిస్తున్నాడు. హీరోగా వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఒడిసిప‌ట్టుకుని, మ‌రోవైపు ఇత‌ర హీరోల్లో ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌ను చేస్తూ ఉన్నాడు. హీరోగా హిట్స్ ద‌క్కిన వెంట‌నే త‌ను హీరోగానే చేస్తానంటూ కూర్చోలేదు. రెండు ర‌కాలుగానూ కొన‌సాగాడు.

అదే స‌మ‌యంలో.. విరామాల్లో ఇత‌డికి హీరోగా మంచి హిట్స్ కూడా ప‌డుతున్నాయి. ఫ‌లితంగా.. అటు క‌మేడియ‌న్ గా, ఇటు హీరోగా బండిని లాగిస్తున్నాడు సంతానం. హీరోగా హిట్ ద‌క్క‌గానే ఇక హీరో పాత్ర‌ల‌కే ఫిక్స్ అంటూ సునీల్ కెరీర్ ను దెబ్బ‌ తీసుకోగా, అలా ఫిక్స‌యి పోకుండా సంతానం రెండు చేతులా అవ‌కాశాల‌ను పొందుతున్నాడు. సునీల్ కూడా సంతానాన్ని అనుస‌రించాల్సిందేమో!
Tags:    

Similar News