టి-సిరీస్ గుల్షన్ బయోపిక్‌లో సౌత్ స్టార్ హీరో?
అందుకే గుల్షన్ జీ బయోపిక్ ని ప్రకటించగానే అభిమాన లోకం చాలా ఉత్సాహం కనబరిచింది.
జీవితం సింపుల్ గా సాగిపోతే అందులో చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. నిరంతర సర్ ప్రైజ్ లు, షాక్ లు, ఊహించని ట్విస్టులతో సాగే జీవితం పెద్ద తెరపై అందమైన ప్యాకేజీలా అలరిస్తుంది. అలాంటి మసాలా ప్యాకేజీతో అలరించే జీవిత కథ టి -సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కథ. సంగీత ప్రపంచంలో ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ఎదుగుదల, ఎదిగిన తర్వాత మాఫియా కనుసన్నల్లో పోరాటం, విచిత్రమైన జీవితంలో అనూహ్యమైన ముగింపు వగైరా అంశాలు విస్తుగొలుపుతాయి.
అందుకే గుల్షన్ జీ బయోపిక్ ని ప్రకటించగానే అభిమాన లోకం చాలా ఉత్సాహం కనబరిచింది. అతడి బయోపిక్ ని తెరపై చూడాలని ఉవ్విళ్లూరారు. కానీ కొన్నేళ్లుగా ఇది సాధ్యపడటం లేదు. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, రణ బీర్ కపూర్ లాంటి స్టార్లు గుల్షన్ పాత్రలో నటిస్తారని కథనాలొచ్చాయి. అయితే వీళ్లు ఎవరూ ఇప్పటివరకూ ఓకే చెప్పలేదు. అయితే 2024 నవంబర్ లో మరోసారి అమీర్ ఖాన్ ఇప్పటికీ ఈ బయోపిక్ లో నటించేందుకు వేచి చూస్తున్నాడని హిందూస్తాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కానీ ఇప్పటివరకూ అమీర్ నుంచి ఈ బయోపిక్ పై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో పరిస్థితి ఎప్పటిలానే ఉందని అర్థమవుతోంది.
గుల్షన్ జీ కుమారుడు టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎల్లప్పుడూ తన తండ్రి జీవితాన్ని తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నా కానీ చాలా కారణాలతో అంతకంతకు ఆలస్యమవుతూనే ఉంది. ఇంతకుముందు `మొగల్` అనే టైటిల్ ని కూడా ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. చాలా సంవత్సరాలుగా పెండింగులోనే ఉంది. అమీర్ ఖాన్, అక్షయ్ లాంటి స్టార్లు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నారని కూడా ప్రచారమైంది. ఈ పరిస్థితుల్లో స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నామని భూషణ్ కుమార్ ప్రకటించారు.
ఇటీవలి సమాచారం మేరకు.. భూషణ్ కుమార్ ఈ బయోపిక్ ను నిర్మించాలని పట్టుదలగా ఉన్నారు. తుషార్ హిరానందినీని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడని సమాచారం. రాజ్‌కుమార్ రావు తో ఈ దర్శకుడు `శ్రీకాంత్` అనే బయోపిక్‌ని తెరకెక్కించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి చాలా సానుకూల సమీక్షలను అందుకుంది. అతడి చేరికతో స్క్రిప్టు తుది మెరుగులు, మార్పు చేర్పులు వగైరా పనులు జరుగుతున్నాయని సమాచారం.
ప్రస్తుతం కొత్త రచనా బృందంతో భూషణ్ కుమార్ సారథ్యంలో బయోపిక్ స్క్రిప్టును రీరైట్ చేస్తున్నారని సమాచారం. తన తండ్రి బయోపిక్ ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ పాత్రను పోషించేవాళ్లు ఎవరు? అన్నది తేలలేదు. గుల్షన్ కుమార్ పాత్రను పోషించడానికి ఒక యువ నటుడి కోసం వెతుకుతున్నారని తెలిసింది. యానిమల్, భూల్ భులయ్యా లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన భూషణ్ కుమార్ తన తండ్రి బయోపిక్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. భూషణ్ కుమార్ కి టాలీవుడ్ దిగ్గజ హీరోలతో చక్కని సత్సంబంధాలు ఉన్నందున ఎవరైనా సౌత్ స్టార్ గుల్షన్ జీ బయోపిక్ లో నటిస్తారా? అన్న ఊహాగానాలు ఇటీవల కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.