శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం.. నిజమైన కథగా 'గులాబీ'

'దసరా' సినిమాతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు.;

Update: 2025-03-10 07:41 GMT

'దసరా' సినిమాతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమాను డైరెక్ట్ చేస్తూనే, ఆయన నిర్మాతగా అడుగుపెట్టాడు. ‘సమ్మక్క సారక్క క్రియేషన్స్’ పేరుతో ఓ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి, టాలెంటెడ్ టీం తో కలిసి కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను ఆయనతో పాటు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రల 'చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్' కలిసి నిర్మించనున్నాయి.


ఈ చిత్రానికి ‘అల్ అమీనా జారియా రుక్సానా'స్ గులాబీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను అనౌన్స్ చేయడానికి ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో నల్ల చీర కట్టిన ఓ యువతి సరిహద్దు ప్రాంతంలో నడుస్తూ ఉండగా, చుట్టూ ఎర్ర గులాబీలు కురుస్తున్నట్టు చూపించారు. ఈ మిస్టీరియస్ లుక్ సినిమా కథపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది.

ఈ ప్రేమ కథ 2009లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. గోదావరిఖని ప్రాంతంలో ఒక యువతి తాను ప్రేమించిన వ్యక్తిని ఎలా ప్రేమించిందో, ఆ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంది అనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇది యధార్థ సంఘటనల ఆధారంగా రాసిన కథ కావడంతో, సినిమా ఎమోషనల్ కనెక్ట్ చాలా బలంగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాకు డైరెక్టర్‌గా చేతన్ బండి వ్యవహరిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల కథను అందించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ‘దసరా’ సినిమాతో తన కథన శైలిని నిరూపించుకున్న శ్రీకాంత్, ఇప్పుడు కొత్త కథతో మరో ఆసక్తికరమైన లవ్ స్టోరీకి బాహుళ్యాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. టీమ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ప్రధాన తారాగణం మరియు సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రేమకథలో ఎలాంటి ఎమోషనల్ లేయర్స్ ఉంటాయో, అది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పించడంలో ముందుండే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, శ్రీకాంత్ ఓదెల నిర్మాణ భాగస్వామ్యం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా గోదావరిఖని నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని, ఇందులో ప్రేమ, సంఘర్షణ, భావోద్వేగాలు ప్రధానంగా నడిపించబోతున్నాయని అంటున్నారు. మరి ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News