టాలీవుడ్ సమ్మర్ రిలీజులివే!
మార్చి 14న కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్ రూబా సినిమాతో పాటూ నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు సినిమాలు రిలీజ్ కానున్నాయి.;
చూస్తూ చూస్తూనే మార్చిలోకి వచ్చేశాం. అంటే సమ్మర్ సినిమాల హడావిడి మొదలైనట్టే. వాస్తవానికి ఈ సమ్మర్ కు చిరంజీవి విశ్వంభరతో పాటూ ప్రభాస్ రాజా సాబ్ కూడా రిలీజవాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నాయి. అధికారిక ప్రకటన మాత్రమే రాలేదు కానీ వాయిదా మాత్రం దాదాపు ఫిక్స్ అయినట్టే.
ఈ నేపథ్యంలో పలు మధ్యతరహా, లో బడ్జెట్ సినిమాలు సమ్మర్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, అనుష్క,కిరణ్ అబ్బవరం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సిద్ధు జొన్నలగడ్డ, మంచు విష్ణు, శ్రీ విష్ణు, కళ్యాణ్ రామ్ ఈ సమ్మర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయారు. వీరి సినిమాలతో పాటూ పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఈ సమ్మర్ లో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మార్చి 14న కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్ రూబా సినిమాతో పాటూ నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి 21న సప్తగిరి లీడ్ రోల్ లో నటించిన పెళ్లి కాని ప్రసాద్ రిలీజ్ కానుండగా, మార్చి 27న విక్రమ్ నటించిన తమిళ మూవీ వీర ధీర శూరన్ పార్ట్2 మరియు మలయాళ మూవీ ఎల్2: ఎంపురాన్ రిలీజ్ కానున్నాయి.
మార్చి 28న నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్‌హుడ్ సినిమాతో పాటూ సితార బ్యానర్ లో మ్యాడ్ కు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి బజ్ కూడా ఉంది. అలానే మార్చి 30న సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించిన బాలీవుడ్ మూవీ సికిందర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఏప్రిల్ నెలలో 4వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా రిలీజ్ కు రెడీ అయింది. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 10న సిద్దూ జొన్నలగడ్డ జాక్ తో పాటూ సన్నీ డియోల్ జాత్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఏప్రిల్ 17కి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలకపాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ షెడ్యూల్ కాగా, 18న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ రిలీజవుతుంది. దీంతో పాటూ ఏప్రిల్ 18న సుందరకాండ మరియు కేసరి చాప్టర్2 లు కూడా రిలీజవుతున్నాయి. ఏప్రిల్ 25న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ లాంటి భారీ తారాగణం ఉంది.
ఇక మే నెలలో అసలు పోటీ ఉంది. క్రేజీ సినిమాలన్నీ మే లోనే రిలీజవుతున్నాయి. ముందుగా మే 1న నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ తో పాటూ సూర్య తమిళ మూవీ రెట్రో, బాలీవుడ్ నుంచి రైడ్2 రిలీజవుతున్నాయి. మే 9న ఎన్నో ఏళ్లుగా పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు పార్ట్1 రిలీజ్ కానుంది. అదే రోజున నితిన్ తమ్ముడు కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఒకవేళ పవన్ సినిమా వస్తే నితిన్ ఆ డేట్ నుంచి తప్పుకుని మరో డేట్ ను చూసుకుంటాడు. పవన్ సినిమా వాయిదా పడితే నితిన్ ఆ స్లాట్ ను వాడుకునే ఛాన్సుంది. మే 16న సింగిల్ మూవీ రిలీజ్ కానుండగా, మే 21న మిషన్ ఇంపాజిబుల్- ది ఫైనల్ రెకనింగ్ రిలీజ్ కు రెడీ అయింది. విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న కింగ్‌డమ్ మూవీ మే 30న రిలీజ్ కు ముస్తాబవుతుంది.