SSMB29.. అప్పుడే కథలు అల్లేస్తున్నారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న కొత్త చిత్రంపై హైప్ ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న కొత్త చిత్రంపై హైప్ ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది వేల కోట్ల సినిమా అవుతుందనే అంచనాలున్నాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
ప్రస్తుతం ఒరిస్సాలో వేసిన భారీ సెట్టింగ్స్ మధ్య చిత్రీకరణ జరుగుతోంది. కొందరు ఇప్పుడు జరుగుతున్నది రిహార్సల్ షూట్ అని అంటున్నప్పటికీ.. అదేమీ కాదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
మామూలుగా రాజమౌళి సినిమా అంటే సెట్స్ నుంచి చిన్న పిక్ కూడా లీక్ కాకుండా పకడ్బందీ భద్రత ఉంటుంది కానీ.. ఈ సినిమా విషయంలో మాత్రం ఏదో తేడా జరుగుతోంది. వరుసగా లీక్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మహేష్ మీద తీసిన ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియో అది.
అందులో మహేష్ రగ్డ్ లుక్‌లో నడిచి రావడం.. ఒక వ్యక్తి వెనుక నుంచి అతణ్ని ముందుకు తోయడం.. వీల్ ఛైర్ మీద కూర్చున్న వ్యక్తి ముందు మహేష్ మోకరిల్లడం కనిపిస్తోంది. ఈ సన్నివేశం చూసి ఈ సినిమా కథ విషయంలో కథలు అల్లేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.
వీల్ ఛైర్‌లో ఉన్నది పృథ్వీరాజ్ అని.. అతనే విలన్ అని.. అతడికో పెద్ద లక్ష్యం ఉంటుందని.. అది తనత పాటు ఎవరూ సాధించలేని పరిస్థితుల్లో మహేష్ బాబును పట్టుకుని వచ్చి తాను చెప్పిన పని చేయక తప్పని పరిస్థితి కల్పిస్తాడని.. తర్వాత మహేష్ ఆ లక్ష్యం (బహుశా నిధిని వెతికి పట్టుకోవడం లాంటిది కావచ్చు) సాధించడం కోసం బయల్దేరడం.. ఈ క్రమంలో అతను చేసే సాహసాల నేపథ్యంలో కథ నడుస్తుందని సోషల్ మీడియాలో ఓ ప్రచారం నడుస్తోంది.
ఇదెంత వరకు నిజం అన్నది పక్కన పెడితే.. ఈ రోజు లీక్ అయిన వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో మహేష్ లుక్.. ఈ సన్నివేశానికి ఎంచుకున్న సెటప్ సినిమా మీద హైప్‌ను ఇంకా పెంచేలా ఉన్నాయి.