తెలుగు సినిమాలకు అక్కడ భలే ఛాన్స్

Update: 2018-03-17 17:30 GMT
చెప్పినట్లే ఈ శుక్రవారం కోలీవుడ్ షట్ డౌన్ అయిపోయింది. అక్కడ సినిమాలకు సంబంధించి అన్ని కార్యకలాపాలూ ఆగిపోయాయి. థియేటర్లలో తమిళ సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. షూటింగులు ఆగిపోయాయి. ఇతర సినీ కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయాయి. సమ్మె విషయంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సహా తమిళ నిర్మాతలందరూ చాలా పట్టుదలతో ఉన్నారు.

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్పీలు) సినిమాల ప్రదర్శన రుసుములు తగ్గించడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా అంగీకరించేవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని విశాల్ అంటున్నాడు. ఐతే తెలుగు నిర్మాతలు సమ్మె విషయంలో తుస్సుమనిపించి డీఎస్పీలదే పైచేయి అయిన నేపథ్యంలో తమిళనాట ఉన్న డీఎస్పీలు అంత తేలిగ్గా లొంగే పరిస్థితి కనిపించడం లేదు. విశాల్ పట్టుదల ఎలాంటిదో తెలిసిందే కాబట్టి సమ్మె ఇప్పుడిప్పుడే ఆగే పరిస్థితి కనిపించడం లేదు.

ఇది పర భాషా చిత్రాలకు కలిసొస్తోంది. ప్రస్తుతం తమిళ నాట తమిళ సినిమాలు మాత్రమే ఆగిపోయాయి. తెలుగు.. హిందీ.. ఇంగ్లిష్ చిత్రాలు యధావిధిగా ప్రదర్శితమవుతున్నాయి. చెన్నై లాంటి నగరాల్లో తెలుగు సినిమాలు చాలా బాగా ఆడతాయి. ఇప్పుడు మంచి సినిమాలు పడితే వాటికి వసూళ్లు మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఐతే ఈ వారం వచ్చిన సినిమాల్లో ‘కిరాక్ పార్టీ’ ఒక్కటే జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే వారం రాబోయే ‘ఎమ్మెల్యే’.. ‘నీది నాది ఒకే కథ’ ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో చూడాలి. సమ్మె నెలాఖరు వరకు కొనసాగితే ‘రంగస్థలం’ తమిళనాట దుమ్ముదులిపే అవకాశం ఉంది.
Tags:    

Similar News