రాజమౌళిగారితో చేయడానికి నేను రెడీనే

Update: 2022-04-12 04:02 GMT
కన్నడలో కొన్ని సినిమాలు మాత్రమే చేసిన యష్ కెరియర్, ఒక్క 'కేజీఎఫ్' సినిమాతో మారిపోయింది. ఆ సినిమాతో ఆయన కన్నడ స్టార్ హీరోలలో ఒకరిగా మారిపోయాడు. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఇతర ఇండస్ట్రీలకు చెందిన దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. అయితే ప్రశాంత్ నీల్  ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి రావడంతో, యష్ మరో ప్రాజెక్టు ఒప్పుకోలేదు. ఎంతో అంకితభావంతో ఆయన 'కేజీఎఫ్ 2' చేస్తూ వచ్చాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగినప్పటికీ అలాగే ఓపిక పట్టాడు.

' కేజీఎఫ్' సినిమాతో సౌత్ ఇండియాకి  చెందిన ఎంతోమంది యష్ అభిమానులుగా మారిపోయారు. యష్ బాడీ లాంగ్వేజ్ .. ఆయన డైలాగ్ డెలివరీ .. లుక్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. అలాంటి వాళ్లందరూ కూడా 'కేజీఎఫ్ 2' కోసం ఎంతో  ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల  14వ తేదీన ఈ సినిమాను  ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రెస్ మీట్  నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై దిల్  రాజు .. ప్రశాంత్ మాట్లాడారు.

' ఇటీవల యష్ తో రాజమౌళి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఒక లైన్ ను విజయేంద్ర ప్రసాద్  డెవలప్ చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. అదే విషయాన్ని గురించిన ప్రశ్న యష్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను అభిమానించే దర్శకులలో రాజమౌళి ఒకరు .. ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది.

ఆయన విజన్ ఎలా ఉంటుందనేది  ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలే చెప్పాయి. అలాంటి రాజమౌళి గారు  అనుకున్న ఒక కథకి నేను సెట్ అవుతానని అనుకుంటే ఎందుకు చేయను?

 రాజమౌళి గారు ఏ కథకి ఏ హీరో సెట్ అవుతారనే విషయంలో ఎంతో పెర్ఫెక్ట్ గా ఆలోచన చేస్తారు. ఆయన అనుకున్న ఒక పాత్రకు నేను కరెక్ట్ అనుకుంటే, ఆ పాత్రను చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.  రాజమౌళి ఇంతవరకూ టాలీవుడ్ స్టార్స్ తోనే సినిమాలు చేస్తూ వచ్చారు.

అందువలన  యష్ తో చేస్తారా  లేదా అనేది సందేహమే. అయితే యష్ ఫ్యాన్స్ మాత్రం ఆయనతో రాజమౌళి ఒక సినిమా చేయాలనే కోరుకుంటున్నారు. అలా జరిగితే అది 'కేజీఎఫ్ 2' కంటే పెద్ద సినిమా అవుతుందని భావిస్తున్నారు. మున్ముందు వాళ్ల ముచ్చట తీరుతుందేమో చూడాలి  మరి.
Tags:    

Similar News