చ‌క్రాల కుర్చీలో న‌టుడు.. వీడియో తీసి పైశాచిక‌త్వం

Update: 2019-09-15 06:26 GMT
బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ గ‌త కొంత కాలంగా విచిత్ర‌మైన జ‌బ్బుతో బాధ‌ప‌డుతూ లండ‌న్ లో చికిత్స పొందుతున్నారు. అది క్యాన్స‌ర్ అని తేల‌డంతో అప్ప‌టి నుంచి ఇర్ఫాన్ మీడియాకు క‌నిపించకుండా ముఖం చాటేస్తున్నాడు. ఇటీవ‌ల లండ‌న్ నుంచి తిరిగొచ్చిన ఇర్ఫాన్ అక‌స్మాత్తుగా ముంబాయి ఏయిర్ పోర్టులో మీడియాకు క‌నిపించి షాకిచ్చారు. వీల్ చైర్ లో ఇర్ఫాన్ ని అత‌ని సిబ్బంది తీసుకెళ్తూ క‌నిపించ‌డం ప‌లువురిని ఆందోళ‌న‌కు గురిచేసింది. అక్క‌డే వున్న ఓ వ్య‌క్తి వీల్ చైర్ లో క్యాప్ పెట్టుకుని ముఖం క‌నిపించ‌కుండా చేతులు అడ్డం పెట్టుకుని వెళుతున్న ఇర్ఫాన్ ని వీడియో తీసే ప్ర‌య‌త్నం చేశాడు.

అయితే ఇర్ఫాన్ వ్య‌క్తిగ‌త సిబ్బంది మాత్రం స‌ద‌రు వ్య‌క్తి వీడియో తీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత ఇర్ఫాన్ త‌న ముఖం క‌వ‌ర్ చేసుకుంటూనే ఏయిర్ పోర్ట్ నుంచి బ‌య‌టికి వెళ్లి త‌న కారులో ఇంటికి వెళ్లిపోయారు.  ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ఇర్ఫాన్ కు ఏమైంది. త‌ను ఇంకా కోలు కోలేదా?. ఎందుకు ముఖం చాటేసుకుని మీడియాకు దొర‌క్కుండా త‌ప్పించుకు తిరుగుతున్నారు?. ఆయ‌న ఆరోగ్యం ఇంకా కుదుట‌ప‌డ‌లేదా? అనే అనుమానాలు అభిమానుల‌తో పాటు బాలీవుడ్ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బాలీవుడ్ టు హాలీవుడ్ ఇర్ఫాన్ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. నేటి ట్రెండ్ సినిమాకి ఇలాంటి విల‌క్ష‌ణ న‌టుడి అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే అతడు ఇలా అంతులేని వ్య‌థ‌తో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఇలా పిచ్చి ప్ర‌కోపించ‌డం అనైతిక‌త‌గా అనిపించ‌డం లేదా? అత‌డు ఎంతో వేద‌న‌తో ఉండి ఇలా త‌ప్పించుకోవాల్సిన ప‌రిస్థితేమిటో అంటూ అభిమానులు క‌ల‌త‌కు గుర‌వుతున్నారు. అలా క‌నిపించ‌డం ఇష్టం లేక‌.. ఆ ఇబ్బందితో చేతులు అడ్డం పెట్టుకోవాల్సి వ‌చ్చింది. అయితే దానిపై ఈ పైశాచిక వీడియోలేంటి? అన్న ఆవేద‌న కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

    

Tags:    

Similar News