ప్రస్థానం దర్శకుడికి కోపమొచ్చింది

Update: 2018-08-20 01:30 GMT
‘వెన్నెల’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు దేవా కట్టా. ఐతే ఆ సినిమా బాగా ఆడినా దేవాపై మరీ అంచనాలేమీ లేవు. అలాంటి స్థితిలో ‘ప్రస్థానం’ లాంటి మైల్ స్టోన్ మూవీతో తనేంటో చాటిచెప్పాడు దేవా. ఆ సినిమా కమర్షియల్‌ గా ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోయినా దేవాకు గొప్ప పేరే తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత సరిగ్గా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయాడతను. సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోయాడు. ‘ఆటోనగర్ సూర్య’.. ‘డైనమైట్’ అతడికి నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ తో తనేంటో రుజువు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు దేవా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దేవా కట్టా అసహనానికి గురయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నే అందుక్కారణం.

మీరెప్పుడు పక్కా కమర్షియల్ సినిమా తీస్తారు అని అడిగింది యాంకర్. దీంతో దేవాకు కోపమొచ్చింది. అసలు కమర్షియల్ సినిమా అంటే ఏంటి అని అతను ప్రశ్నించాడు. అందరూ దీనికి సంబంధించిన భ్రమల నుంచి బయటికి రావాలని అతను కోరాడు. సుకుమార్ ‘రంగస్థలం’లో క్యారెక్టర్ డ్రివెన్ రోల్ తో రామ్ చరణ్ ను ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడో.. ఆ సినిమాను ఎంత పెద్ద హిట్ చేశాడో ఉదాహరణగా చెప్పాడు దేవా. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని.. కమర్షియల్ సినిమా.. ప్యారలల్ సినిమా మధ్య అంతరం చెరిగిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ప్రేక్షకులు కథా బలం ఉన్న.. కొత్తదనం ఉన్న సినిమాల్నే ఆదరిస్తున్నారని.. కమర్షియల్ హంగుల కోసం చూడటం లేదని.. కంటెంట్ బలంగా ఉన్నదే కమర్షియల్ సినిమా అని..  ఇది మంచి పరిణామమని దేవా అభిప్రాయపడ్డాడు.
Tags:    

Similar News