మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన ఎన్టీఆర్..!

Update: 2022-08-04 13:56 GMT
దివంగత నందమూరి తారక రామారావు ఆఖరి కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. మేనత్త కుటుంబాన్ని జూనియర్​ ఎన్టీఆర్​ ఈరోజు పరామర్శించారు. భార్య లక్ష్మీ ప్రణతి - అన్న కల్యాణ్​ రామ్​ తో కలిసి మేనత్త నివాసానికి​ వచ్చారు తారక్. మేనత్త కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.

ఉమా మహేశ్వరి ఆగస్టు 1వ తేదీన మరణించగా.. నిన్న (ఆగస్టు 3న) అంత్యక్రియలు నిర్వహించారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉండగా.. ఆమె నిన్న తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం అంత్యక్రియలు జరిపారని తెలుస్తోంది.

మేనత్త అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన తారక్.. ఈరోజు కంఠమనేని కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. అనంతరం తారక్ తో మాట్లాడించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. ఏం మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడేకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల తన భార్యతో కలిసి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో నేడు మేనత్త ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమామహేశ్వరి మరణం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపింది. సోదరి మరణ వార్త వినగానే ఆమె సోదరులైన బాలకృష్ణ - రామకృష్ణ ఆమె నివాసానికి వెళ్లారు. నారా చంద్రబాబు నాయుడు - లోకేష్ - కల్యాణ్​రామ్​ - నారా రోహిత్​ - చైతన్య సహా కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు.

కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ తన మేనత్త ఫ్యామిలీని కలిసి మాట్లాడారు. తారక్ రావడానికి ముందే మరో మేనత్త నారా భువనేశ్వరి అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News