ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా... జూనియ‌ర్ ఎన్టీఆర్ నివాళి

Update: 2022-05-28 10:30 GMT
విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆ మ‌హా మ‌నీషిని పలువురు సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ త‌న‌యుడు.. నంద‌మూరి హ‌రికృష్ణ కుమారుడు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గుర‌య్యారు. శ‌త‌జ‌యంతి వేడుక‌ల ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకుని.. జూనియ‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. అని జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఇక‌, సినీ రంగానికి చెందిన ద‌ర్శ‌క దిగ్గ‌జాలు కూడా అన్న‌గారికి ఘ‌న నివాళుల‌ర్పించారు. "జీవితంలో ఒక్కసారైనా ఎన్టీఆర్‌తో సినిమా చేయగలనా..? అనుకున్నా. కానీ ఆయనతో గొప్ప సినిమాలు తెరకెక్కించే అదృష్టం నాకు దక్కింది" అంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని రాఘవేంద్రరావు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియోని షేర్‌ చేశారు.

"నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆయన సినిమాలు చూసేవాడిని. రాముడు, రావణుడు, దుర్యోధనుడు, కృష్ణుడిగా ఆయన ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. జీవితంలో ఒక్కసారైనా ఆయనతో సినిమా చేయగలనా..?అనుకునేవాడిని. భగవంతుడి దయ వల్ల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మొదటిసారి ఆయన సినిమాకు పనిచేయడం, ఆయనపై క్లాప్‌ కొట్టే అవకాశం వచ్చింది. నేనెంతో అదృష్టవంతుడిని అనుకున్నా. ఆతర్వాత 'అడవిరాముడు' లాంటి గొప్ప చిత్రానికి నన్ను దర్శకుడిగా ఆయన ఎంపిక చేయడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. అనిపేర్కొన్నారు.

"ఆయన కలియుగ దైవం. నమ్ముకున్నవారికి ఆర్తత్రాణ పరాయణుడు. ఈ రోజు నుంచి వారి శత జయంతి ప్రారంభమౌతుంది. అన్నగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుజాతిని ఆశీర్వదించండి. తెలుగు అన్న మూడు అక్షరాలను విశ్వవ్యాప్తం చేసిన మహానుభావా వందనం శిరసాభివందనం" -పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు.

తెలుగు వారంతా గర్వంగా మా వాడు అని చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా శ్రీ ఎన్టీఆర్ గారిది విలక్షణమైన వ్యక్తిత్వం... అని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ట్వీట్ చేశారు.
Tags:    

Similar News