టాలీవుడ్ నిర్మాత‌లు ఆ త‌ప్పు చేయొద్ద‌ని హెచ్చ‌రిక‌!

Update: 2020-06-07 04:51 GMT
కొంద‌రి అత్యుత్సాహం.. మ‌రికొంద‌రికి ఇబ్బందిక‌రం కావొచ్చు. ఒక్కోసారి అవ‌త‌లివారికి డ్యామేజీని క‌లిగించే ప‌రిణామంగానూ మారుతుంది. అలాంటి అత్యుత్సాహం చూపించిన తెలుగు నిర్మాత‌ల‌కు క‌న్న‌డ నిర్మాత‌లు ఇచ్చిన వార్నింగ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `మ‌మ్మ‌ల్ని ఇలా వ‌దిలేయండి మ‌హాప్ర‌భో!`` అంటూ తెలుగు నిర్మాత‌ల్ని శాండ‌ల్ వుడ్ నిర్మాత‌లు వేడుకునేంత‌వ‌ర‌కూ వెళ్లింది స‌న్నివేశం. అంతగా ఏం త‌ప్పు చేశారు మ‌నోళ్లు? అంటే...

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప‌ద్ధ‌తిపై ఫిలింఛాంబ‌ర్- మండ‌లిలో కొన్ని రూల్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వాటిని అతిక్ర‌మించి త‌మ‌కు న‌చ్చినట్టు న‌చ్చిన‌‌వాళ్ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేందుకు కొంద‌రు నిర్మాత‌లు రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు.  తెలుగు నిర్మాతల గిల్డ్ నియమం ప్రకారం.. ఏ బ్యానర్ అయినా హీరోలు దర్శకులపై పూర్తి పేజీ ప్రకటనలను ఇవ్వకూడదు. దానివ‌ల్ల అంద‌రికీ ఇబ్బంది అవుతుంద‌ని ప్ర‌తిపాదించారు. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేస్తూ ప‌లువురు నిర్మాత‌లు ప‌దే ప‌దే త‌ప్పు చేస్తూనే ఉన్నారు.

ఇదే తీరుగా మైత్రి మూవీ మేక‌ర్స్ ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో పూర్తి పేజీ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం అక్క‌డ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్న సినిమాకి సంబంధించి పూర్తి పేజీ ప్ర‌క‌ట‌న‌ల‌తో క‌న్న‌డ ప‌త్రిక‌ల్ని నింపేశారు. జాతీయ ప‌త్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు.

దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ నిర్మాతలు తెలుగు నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశార‌ని తెలుస్తోంది. ఈ సమస్యపై కొందరు కర్ణాటక నిర్మాతలు టాలీవుడ్ పెద్ద‌ల్ని పిలిచి.. ``దయచేసి మా పరిశ్రమను ఇలా వదిలేయండి. హీరోలను.. దర్శకులను ఇలాంటి పూర్తి పేజీ ప్రకటనలతో విలాస‌ప‌రుల్ని చేయొద్దు. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ప్రతి హీరో.. దర్శకుడు అలాంటి వాటిని ఆశిస్తే మేం ఏమైపోవాలి?`` అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌.

కేజీఎఫ్ 2 త‌ర్వాత ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప్ర‌శాంత్ ని ఆక‌ట్టుకునేందుకు ఆ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌న అత్యుత్సాహం.. క‌న్న‌డిగుల‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌న్న ముచ్చ‌టా చాంబ‌ర్ వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది.





Tags:    

Similar News