కేజీఎఫ్ షాకిస్తే.. రెట్టింపు స్ట‌ఫ్ తో మ‌న‌వాళ్లు సై

Update: 2022-04-22 02:30 GMT
పీక్ స్టేజ్ భావోద్వేగాలు.. యాక్ష‌న్ ఘ‌ట్టాలు.. అంబరాన్నంటే ఎలివేష‌న్స్ వెర‌సీ ట్రిపుల్ ఆర్‌,  కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 . ఈ రెండు చిత్రాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇక‌పై ప్రేక్ష‌కులు ఇలాంటి చిత్రాల‌నే కోరుకుంటున్నారా?.. ఇలాంటి చిత్రాలే చూస్తారా? అనేంత‌గా ఈ రెండు సినిమాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. వ‌సూళ్ల ప‌రంగా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయాన్ని లికించాయి. మ‌రి ఇలాంటి చిత్రాల త‌రువాత మ‌న వాళ్లు నుంచి ఇలాంటి సినిమాలే రాబోతున్నాయా? అంటే అంత‌కు మించిన వినోదం.. యాక్ష‌న్ అంశాల మేళ‌వింపుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాన్నాయి.

భారీ క్రేజీ మూవీని చూసిన ప్రేక్ష‌కులు మ‌రో స్టార్ సినిమా వ‌స్తోందంటే అంత‌కు మించి అని ఆలోచిస్తారు. ఇప్ప‌డు అదే పంథాలో అంత‌కు మించి వినోదం, యాక్ష‌న్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 చిత్రాలు ఓ విధంగా మేక‌ర్స్ తో పాటు స్టార్స్ కి గ‌ట్టి సాకిచ్చాయ‌ని చెప్పొచ్చు. ఈ రెండు చిత్రాల్లో హీరోల‌ని చూపించిన తీరు, వారికిచ్చిన ఎలివేష‌న్ మాస్ ఆడియ‌న్స్ ని కేక‌పెట్టించాయి. థియేట‌ర్ల‌లో విజిల్స్ తో మోత మోగించాయి.  

దీంతో ఈ రెండు చిత్రాల సెట్ చేసిన టార్గెట్ ని రీచ్ కావ‌డం త‌దుప‌రి చిత్రాల‌కు సంక‌టంగా మారింది. అయితే అంత‌కు మించిన ప్ర‌త్యేక‌త‌ల‌తో టాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర‌కు రెడీ అయిపోతున్నాయి. ఈ రేసులో ముందుగా మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఇందులో చిరంజీవితో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. రెండేళ్ల విరామం త‌రువాత చిరు నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, చ‌ర‌ణ్ , చిరు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైలర్ టెర్రిఫిక్ గా వుండ‌టంతో విజువ‌ల్ ఫీస్ట్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ త‌రువాత రంగంలోకి దిగుతున్న హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. త‌న నుంచి రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా ఇది. `పోకిరి` వైబ్స్ క‌నిపిస్తున్నాయ‌ని మ‌హేష్ ప్ర‌క‌టించ‌డంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. సినిమా పై బ‌జ్ కూడా ఓ రేంజ్ లో వుంది. 40 నిమిషాల పాటు సాగే ల‌వ్ ట్రాక్ ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని టీమ్ అంటోంది. మే 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

దీని త‌రువాత లైన్ లో వున్న మూవీ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `లైగ‌ర్‌`. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో మైక్ టైస‌న్ న‌టించారు. అంతే కాకుండా ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల‌లో విడుద‌ల కు ప్లాన్ చేశారు. అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కించిన ఈ మూవీ రిజ‌ల్ట్ పై విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జ‌గ‌న్నాథ్ భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. ఓ ఛాయ్ వాలా ఎలా ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాపియ‌న్ షిప్ ని సొంతం చేసుకున్నాడ‌న్న‌దే ఈ క‌థ‌.

తెర‌పై చూపించిన విధానంపైనే ఈ సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డి వుంది. ఆగ్ ల‌గా దేంగే అంటూ టీజ‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇక ఈమూవీ త‌రువాత పాన్ ఇండియాపై క‌న్నేసిన మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. క్రిష్ డైరెక్ష‌న్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. క‌థా నేప‌థ్యం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 17వ శ‌తాబ్దంలోని ఔరంగజేబు కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగ‌నుంచి ఆనాటి రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో వీర‌మ‌ల్లుగా ఓ గ‌జ‌దొంగ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు.

పీరియాడిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ని, ఆనాటి కాల‌మాన ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్టే విధంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలే వున్నాయి. ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ ల‌ని దృష్టిలో పెట్టుకుని లార్జ‌ర్ దెన్ లైఫ్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Tags:    

Similar News