ప్రయోగం వద్దు.. ఆలస్యం అసలే వద్దు

Update: 2019-02-06 10:39 GMT
అక్కినేని అఖిల్‌ తన మూడవ సినిమాతో కూడా నిరాశ పర్చాడు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోగా అఖిల్‌ నిలుస్తాడని ఆశించిన అక్కినేని ఫ్యాన్స్‌ ను వరుసగా మూడు సార్లు కూడా అఖిల్‌ నిరాశ పర్చాడు. మొదటి సినిమా భారీ బడ్జెట్‌ తో నిర్మించడం వల్ల నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత హలో మరియు మిస్టర్‌ మజ్ను చిత్రాలు మీడియం బడ్జెట్‌ తో రూపొందినా కూడా నిర్మాతలు సేఫ్‌ జోన్‌ కు చేర్చలేక పోయాయి. మిస్టర్‌ మజ్ను చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని, హలో చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చి మరీ చేశాడు. అయినా కూడా ఇటీవలే విడుదలైన మిస్టర్‌ మజ్ను ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.

మిస్టర్‌ మజ్ను ఫలితంను దృష్టిలో పెట్టుకుని అఖిల్‌ తదుపరి చిత్రం విషయంలో ఆలస్యం చేయవద్దని నిర్ణయించుకున్నాడు. అలాగే సినిమా కథ కోసం ఎక్కువ సమయం కేటాయించవద్దని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు నుండి అనుకుంటున్నట్లుగానే అఖిల్‌ నాల్గవ సినిమాను సత్య పినిశెట్టి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో అఖిల్‌ నాల్గవ సినిమా అంటూ ప్రచారం జరిగినప్పటికి అవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున కూడా సత్య స్క్రిప్ట్‌ కు ఓకే చెప్పాడని తెలుస్తోంది.

'మలుపు' అనే చిత్రంతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సత్య అఖిల్‌ తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అఖిల్‌ మూడవ సినిమాకు సత్య దర్శకత్వం వహించాల్సి ఉంది. కాని అది సాధ్యం కాలేదు. వెంకీ అట్లూరి స్క్రిప్ట్‌ పై నమ్మకంతో 'మిస్టర్‌ మజ్ను' చిత్రాన్ని చేయడం జరిగింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేక పోవడంతో సత్య దర్శకత్వంలో వెంటనే సినిమాను మొదలు పెట్టి, ఇదే ఏడాది అఖిల్‌ ఆ సినిమాను తీసుకు రావాలని భావిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే అఖిల్‌ 4 మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News