కన్నీళ్లు పెట్టుకున్న కిరణ్ అబ్బవరం!

Update: 2022-03-02 03:04 GMT
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఒక సినిమా తరువాత ఒకటిగా ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'సెబాస్టియన్' రూపొందింది. నువేక్ష - కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చాడు. సిద్ధారెడ్డి - రాజు - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.

బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేడుకకి అడివి శేష్ .. వేణు శ్రీరామ్ .. వెంకీ కుడుముల .. ఆకాశ్ పూరి తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 'సెబాస్టియన్' సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ మా టీమ్ లో ఎవరికీ కూడా వన్ పర్సెంట్ కూడా ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. అందరం కూడా ఈ సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నాము. ఎందుకంటే ఒక అవకాశం విలువ మాకు తెలుసు. కెమెరా ముందు నిలబడటం ఒక అదృష్టం .. అదొక వరం. అందుకే అలాంటి అవకాశాన్ని నిలబెట్టుకోవదానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను.

డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కుని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నిరాశ పరచవద్దనే ఉద్దేశంతోనే మేమంతా పనిచేస్తూ వెళుతున్నాము. 'సెబాస్టియన్ ' సినిమా తమ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోతుందనే మా టీమ్ లోని వాళ్లంతా చెప్పారు .. అదే మాటను నేను కూడా చెబుతున్నాను. 'సెబాస్టియన్' సినిమాను చూసిన తరువాత మీరంతా మాకు రెస్పెక్ట్ ఇస్తారని నమ్ముతున్నాను. కచ్చితంగా ఇది మా రెస్పెక్ట్ ను పెంచే సినిమా అవుతుంది. ఫస్టాఫ్ అంతా కూడా సెబా మిమ్మల్ని నవ్విస్తాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం .. తల్లికి ఇష్టమైన ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి సెబా ఏం చేశాడనేదే కథ.

జిబ్రాన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు .. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీరు చెప్పాలి. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కోసమైనా ఈ సినిమా చూడాలి. నేను హీరోగా నిలబడాలని మా అన్నయ్య ఎంతో తాపత్రయపడేవాడు. అందుకోసం ఎంతో ఖర్చుపెట్టేవాడు. తనకి వచ్చిన జీతంలో నుంచే ప్రతి నెలా నాకు కొంత ఇచ్చేవాడు.

ఈ సినిమా పూర్తయిన తరువాతనే తాను ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. మా అన్నయ్య కలను నిజం చేస్తాను .. మంచి సినిమాలు చేస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాపై జాలితో ఎవరూ ఈ సినిమాకి రావొద్దు .. కంటెంట్ నచ్చితేనే ఈ సినిమాను చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు. 
Tags:    

Similar News