ముందు తల్లి.. తర్వాత మళ్లీ పెళ్లట?

Update: 2016-09-12 04:36 GMT
తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన అందం నాటి బాలీవుడ్ బ్యూటీ.. నేపాలీ సుందరి మనీషా కొయిరాల సొంతం. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తమిళంలో చేసిన సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఈ భామ.. తన అందంతో నాటి కుర్రకారును ఫిదా చేసింది. కళ్లల్లో తొణికిలాడే అమాయకత్వంతో మనసు దోచుకునే అందాల భామ.. చేజేతులారా తన కెరీర్ ను తానే పక్కదారి పట్టేలా చేసుకుందని చెబుతారు. ఫిట్ నెస్ విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యంతో అవకాశాలు తగ్గుముఖం పట్టటం.... అనంతరం పెళ్లి కావడం.. అందులోంచి కూడా బయటకు రావడం జరిగిపోయాయి. విడాకులు తీసుకొన్న అనంతరం ఆమె భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు.

కొంతకాలం క్యాన్సర్ తో పోరాడి ఎట్టకేలకు దాన్ని జయించి.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. అప్పట్లో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చి.. మనీషా కొయిరాలా ఇలా మారిపోయిందా? అని అవాక్కు అయ్యేలా చేశారు. ఆమెను చూసి చాలామంది షాక్ కు గురయ్యారు. తన మీద తాను దృష్టి పెట్టటంతో ఈ భామ రికవరీ అయి.. మళ్లీ ఇపుడు సినిమాలు చేస్తున్నారు.

అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం ఒంటరి. ఫ్యామిలీ మొత్తం నేపాల్ లో ఉండటం.. ఈమె మాత్రం ముంబయిలో ఉండటం పిచ్చ బోర్ గా ఉంది. వైవాహిక బంధంలో ఎదురైన చేదు అనుభవం.. గడిచిన కాలంలో జీవితంలో ఎదురైన ఘటనలు దృష్ట్యా ప్రస్తుతం ఒక్కటిగా ఉంటున్న ఆమె ఇప్పుడు తల్లి కావాలని అనుకుంటోందట. అందుకే ఎవరినైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలన్న ఆలోచన చేస్తుందట.

ఎవరినైనా దత్తత తీసుకొని.. తల్లి రోల్ ప్లే చేస్తూ.. తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలని భావిస్తోందట మనీషా. ఏడాది వ్యవధిలో ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని.. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానంటోంది. మరి.. ఈ అందాల రాక్షసి కోరిక ఎంతవరకూ తీరుతుందో చూడాలి.
Tags:    

Similar News