మిష‌న్ ఇంపాజిబుల్.. ఆ మూడు సీన్లు ప‌రాకాష్ట‌

Update: 2023-07-13 10:55 GMT
టామ్ క్రూజ్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ ఫ్రాంఛైజీ చిత్రం 'మిష‌న్ ఇంపాజిబుల్ 7' (డెడ్ రిక‌నింగ్ పార్ట్ 1) థియేట్ల‌లోకి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త‌దేశం లో అత్యంత భారీ గా ఈ చిత్రం విడుద‌లైంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ కూడా చెప్పుకోద‌గ్గ స్థాయి లో రిలీజ్ కాగా దీని పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

డే1లో షో చూసిన వారి స్పంద‌న ఎలా ఉంది? అంటే .. దీనికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. థియేట‌ర్ల‌లో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు విజిల్స్ ప‌డుతున్నాయంటే ఇందు లో విజువ‌ల్ ట్రీట్ ఏ రేంజు లో వ‌ర్క‌వుటైందో అర్థం చేసుకోవ‌చ్చు.

టామ్ క్రూజ్ ష‌ష్ఠి పూర్తి (61) పూర్త‌యిన ఈ వ‌య‌సు లో ఇంత అద్భుత‌మైన యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాలో న‌టించ‌డం అసాధార‌ణమైన ఫీట్ అన‌డంలో సందేహం లేదు. ఇందులో లెక్క‌కు మిక్కిలి రిస్కీ స్టంట్స్ తో టామ్ గ‌గుర్పాటు కు గురి చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా కి అత‌డు ఎంపిక చేసుకున్న క‌థాంశం.. స్క్రీన్ ప్లే స‌హా ప్ర‌తిదీ హైలైట్. ఏఐ ఆధారిత మిష‌న్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే స‌రికొత్త గూఢ‌చారి సినిమా ఇది.

క్లైమాక్స్ లో ట్రైన్ ఎపిసోడ్ ... ప‌సుపు రంగు కార్ లో ఛేజింగ్ సీక్వెన్స్.. లోయ‌ లోకి హీరో డెడ్లీ బైక్ జంప్ ల‌కు సంబంధించి చిన్న‌పాటి గ్లింప్స్ ని రిలీజ్ ముందే మేకింగ్ వీడియోల్లో ప్ర‌ద‌ర్శించారు. ఆ స‌న్నివేశాల‌న్నీ సినిమాలో మైండ్ బ్లోయింగ్.. ఈ సినిమా ఇటీవ‌లి కాలం లో వ‌చ్చిన అద్భుత యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ స్పై చిత్రం అన‌డం లో ఎలాంటి సందేహం లేదు.

"ఇది క‌న్నుల పండుగ‌.. మ‌హ‌దాద్భుతం.." అని టామ్ క్రూజ్ అభిమానులు థియేట‌ర్ల‌లో సినిమా ని వీక్షించాక‌ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో రూపొందిన ఈ సినిమా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ ను థియేట‌ర్ల‌కు లాగ‌డం గ్యారెంటీ అన్న టాక్ వినిపిస్తోంది.

Similar News