మోడీ సభలో దేవగౌడను తలపించాడు

Update: 2016-01-04 10:52 GMT
ఇప్పటి తరానికి దేవగౌడ్ అన్న వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ.. డెబ్భై చివర్లో.. ఏనభై మొదట్లో పుట్టిన వారికి దేవగౌడ సుపరిచితులు. సంకీర్ణ భారతంలో ప్రధానమంత్రి అయిన దేవగౌడ.. కార్టూనిస్టులకు.. ఫోటోగ్రాఫర్లకు చాలానే పని కల్పించారు. సభ ఏదైనా సరే.. చక్కగా ఒక కునుకు తీసే అలవాటు ఉన్న ఆయనపై అప్పట్లో జోకేలే జోకులు. అదే పనిగా నిద్రపోయే వారిని ఏం దేవగౌడ పూనాడా? ఏమిటని కసురుకునే రోజులు గతంలో ఉండేవి.

ఆ తర్వాత అంతలా నిద్రపోయే నేత పెద్దగా బయటకు రాలేదు. తాజాగా ప్రధాని మోడీ.. తన కర్ణాటక పర్యటన సందర్భంగా మైసూర్ లో జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి హాజరైతే సదరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరు కావటం మామూలే. అదే క్రమంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు. మోడీ ప్రసంగం మొదలు కాగానే.. చల్లగా నిద్రలోకి జారుకున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య.

సాధారణంగా మోడీ లాంటి వక్త మాట్లాడుతుంటే.. ఉత్సాహం ఉరకలెత్తటంతోపాటు.. వేదిక మీద ఉన్న వారి దగ్గర నుంచి.. సభలో పాల్గొన్న వారంతా మాంచి హుషారుగా ఉంటారు. మరి.. మోడీ మాటలు సిద్ధరామయ్యకు జోలపాటలా అనిపించాయేమోకానీ.. ఆయన కూర్చొని కునుకు తీయటంతో ఫోటోగ్రాఫర్లు.. తమ కెమేరాలకు పని చెప్పారు. ప్రధాని సభలో కునుకు తీయటంతో సిద్ధరామయ్య అలవాటు క్రాస్ చెక్ చేస్తే.. సభల్లో కునుకు తీయటం ఆయనకు అలవాటేనని తేలింది. మొత్తానికి దేవగౌడ వారసుడు.. కర్ణాటకు చెందిన మరో నేత కావటం గమనార్హం.
Tags:    

Similar News