ఎమ్మెస్ కు ‘నంది’ ఎలా ఇస్తారంటూ..

Update: 2016-08-07 15:30 GMT
ఎవరైనా పెద్ద వాళ్లు చనిపోతే ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ రొటీన్ గా అందరూ ఓ కామెంట్ చేసేస్తుంటారు. ఐతే నిజంగా లోటు తీర్చలేని నటులు కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో ఎమ్మెస్ నారాయణ పేరు కచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన పాత్రల గురించి.. ఆయన కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాల్లో అద్భుతమైన కామెడీ పండించి ప్రేక్షకుల రికార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులు కూడా చాలానే అందుకున్నారు ఎమ్మెస్. బెస్ట్ కమెడియన్ గా ఏకంగా ఐదు నందులు అందుకున్న ఘనత ఆయనది. గతంలో తాను రాసిన కాలమ్ లో భాగంగా తనకు వచ్చిన నంది అవార్డుల గురించి.. తనపై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు ఎమ్మెస్. ఇంతకీ ఆయనేమన్నారంటే..

‘‘1998లో ఉగాది రోజు నేను.. ఈవీవీ ఓ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్తూ పంజాగుట్టలో టిఫిన్ చేస్తుండగా.. ‘మానాన్నకు పెళ్లి’ సినిమాకు నంది అవార్డు వచ్చిందంటూ ఈవీవీకి ఫోన్ వచ్చింది. షాక్‌ అయిపోయాను. నిజానికి నేను రచయితగా నంది తీసుకోవాలనుకున్నా. కానీ నటుడిగా వచ్చింది. ఆ తర్వాత రామసక్కనోడు.. సర్దుకుపోదాం రండి.. శివమణి సినిమాలకు కూడా నంది వచ్చింది. ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు ‘ఆనందం’ సినిమాలో నా పాత్రకు నంది అవార్డుకు దరఖాస్తు చేయలేదు. లేదంటే దానికి కూడా అవార్డు వచ్చేదేమో. ‘దూకుడు’ సినిమాకు ఐదో నంది అందుకున్నాను. ఐతే నాకు వచ్చిన ఓ నంది అవార్డు విషయంలో నా సహచర నటుడే అభ్యంతర పెట్టాడు. తాగుబోతు పాత్రలకు నంది అవార్డు ఎలా ఇస్తారంటూ కామెంట్ చేశాడు. కోర్టుకు వెళ్తే నంది వెనక్కి వెళ్తుందని కూడా అన్నాడు. తాగుబోతు పాత్రలకు అవార్డు ఇవ్వొద్దని చట్టం కూడా ఉందన్నాడు. ఐతే తాగుబోతు పాత్రకు.. తిరుగుబోతు పాత్రకు.. వేశ్య పాత్రకు అవార్డు ఇవ్వకూడదంటూ ఏమీ ఉండదు. బెస్ట్ విలన్ అని అవార్డిస్తారు. మరి విలన్ పాత్ర చేసేవాడు అన్నీ చెడ్డ పనులే చేస్తాడు. మంచి పనులేమీ చేయడు. అలాంటపుడు అవార్డెలా ఇస్తారని అడుగుతారా? ఇలా ఆయన్ని సమాధాన పరిచే ప్రయత్నం చేశాను’’ అని చెప్పారు ఎమ్మెస్. దూకుడు సినిమా మహేష్ బాబు వల్లే ఆడిందని.. తన లాంటి కమెడియన్లు సపోర్ట్ చేశామని.. కానీ మహేష్ మాత్రం తమ వల్లే సినిమా ఆడిందంటూ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని.. ఈ రోజుల్లో అలా ఒప్పుకునే హీరోలు ఎవ్వరూ ఉండరని ఎమ్మెస్ వ్యాఖ్యానించాడు.
Tags:    

Similar News