'బంగార్రాజు' సైలెంట్‌ గా షురూ

Update: 2019-09-24 05:08 GMT
నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం విడుదలైనప్పటి నుండి కూడా అందులోని ప్రధాన పాత్ర అయిన బంగార్రాజు ను బేస్‌ చేసుకుని మరో సినిమా చేయాలని నాగార్జున మరియు కళ్యాణ్‌ కృష్ణ భావించిన విషయం తెల్సిందే. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు బంగార్రాజు చిత్రం పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది. మన్మధుడు 2 చిత్రంతో పాటు బంగార్రాజు అనుకున్నారు. కాని రెండు సినిమాలు ఒకే సారి చేయడం నాగార్జునకు సాధ్యం కాలేదు.

నాగార్జున 'మన్మధుడు 2' చిత్రం పూర్తి చేసిన తర్వాత బిగ్‌ బాస్‌ తో బిజీగా ఉన్న కారణంగా బంగార్రాజు చిత్రాన్ని నవంబర్‌ లో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అనూప్‌ రూబెన్స్‌ తో కలిసి దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మ్యూజిక్‌ సిట్టింగ్‌ లో పాల్గొంటున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం మ్యూజికల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈసారి కూడా సంగీతం పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక నాగార్జునతో పాటు ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కథకు ముందు జరిగే కథతో బంగార్రాజు చిత్రం రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున మరియు నాగచైతన్యలు సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారట. ఇప్పటికే ఒక పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేయగా చైతూకు జోడీగా ఒక స్టార్‌ హీరోయిన్‌ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. నవంబర్‌ లో షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
Tags:    

Similar News