బిగ్‌ బాస్‌ లో నాగ్ వార్నింగ్‌ లు ర‌క్తిక‌ట్టాయ్‌!

Update: 2019-08-11 04:37 GMT
అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-3 రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ మేట్స్ గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడుతుండటంతో మూడో వారం షో రసవత్తరంగా జరిగింది. ఇక శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకి వార్నింగ్ ల మీద వార్నింగులు ఇచ్చారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే నాగ్ అంత సీరియస్ అవ్వడంతో హౌస్ మేట్స్ షాక్ తిన్నారు.

ఓ టాస్క్‌ లో భాగంగా అలీ-హిమజ మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ నాగార్జున అలీ చేత 21 గుంజీలు తీయించాడు. అలాగే అలీకి చీవాట్లు పెడుతూ - హిమజ విషయంలో ప్రవర్తించిన తీరు సరికాదంటూ ఆమెకు మద్దతు పలికారు. పైగా - వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నా సర్ది చెప్పేందుకు ఎవరూ రాకపోవడంపై హౌస్‌ లోని మిగతా సభ్యులకి క్లాస్ తీసుకున్నారు. కానీ  హిమజ విషయంలో జోక్యం చేసుకుని అలీకి అడ్డుపడిన తమన్నాను నాగార్జున ప్రశంసించారు.

అటు రవి విషయంలో తమన్నా బిహేవియర్ ని నాగ్ తప్పుబట్టారు. తనని ఎలిమినేషన్ కి నామినేషన్ చేశాడని రవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తమన్నా నానా మాటలు అంది. దీని గురించి చెప్పి నాగార్జున తమన్నాకి క్లాస్ పీకారు. ఒకమనిషిని అంతలా మాట్లాడటం సరికాదన్నారు. అలాగే జ్యోతితో తమన్నా గొడవ పడిన సందర్భంలో తమన్నా జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టులు అందరూ డబ్బులు కోసం యాక్టింగ్ చేస్తారని - శివజ్యోతి కూడా యాక్టింగ్ చేస్తోందని - జర్నలిజం ఒక యాక్టింగ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దీనిపై స్పందించిన నాగ్..తమన్నా మాట్లాడిన వీడియోని మళ్ళీ ప్లే చేసి చీవాట్లు పెట్టారు. పైగా వీడియో చూసి తలదించుకుని నవ్వుతున్న తమన్నాపై నాగార్జున మండిపడ్డారు. అప్పుడేమో జర్నలిజం ఒక యాక్టింగ్ అని - ఇప్పుడు ముసుముసిగా నవ్వుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన తమన్నా.. తాను నవ్వడం లేదని - చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో శివజ్యోతి సహా జర్నలిస్టులు అందరికీ తమన్నాతో నాగ్ క్షమాపణలు చెప్పించారు.

మరోవైపు ఓ టాస్క్ లో భాగంగా నగదు బాక్స్ అద్దం పగలగొట్టిన రవికృష్ణకి చేయి తెగినప్పుడు శ్రీముఖిపై నోరు జారిన రాహుల్‌ పైనా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీముఖిని ఉద్దేశించి ‘ఫాల్తు ఐడియాలు.. ఫాల్తు మొహంది’ అన్న వ్యాఖ్యలను నాగార్జున గుర్తు చేస్తూ సీరియస్ అయ్యారు. ‘రాహుల్ నీకు ఇదే ఆఖరి వార్నింగ్ ఇలాంటి ఫాల్తు మాటలు మరోమారు వద్దు’ అంటూ వార్నింగ్ ఇచ్చి - రాహుల్‌ తో శ్రీముఖికి సారీ చెప్పించారు.

ఇదిలా ఉంటే హౌస్ మేట్స్ కి క్లాస్ తీసుకున్నాక నాగ్ వారితో సరదాగా ఓ గేమ్ ఆడించారు. గేమ్ అయ్యాక ఎలిమినేషన్ లో ఉన్న బాబా భాస్కర్ - రాహుల్ - పునర్నవి - వితిక - తమన్నాలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆదివారం చెబుతానని ఎపిసోడ్ ని ముగించారు.
Tags:    

Similar News