బాబు మళ్లీ ఆ మాటే..నీలిమ కౌశల్‌ సీరియస్‌

Update: 2018-12-03 14:30 GMT
తెలుగులో బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 కంటే సీజన్‌ 2 కు సోషల్‌ మీడియాలో ఎక్కువగా స్థానం దక్కింది. కౌశల్‌ ఆర్మీ వల్ల సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ 2 గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కౌశల్‌ ఆర్మీ ఎవరిని ఎలిమినేట్‌ చేయాలనుకుంటే వారిని ఎలిమినేట్‌ అయ్యేవారు. షో ప్రారంభం అయిన మూడు నాలుగు వారాల్లోనే కౌశల్‌ ఆర్మీ వల్ల కౌశల్‌ గెలవబోతున్నాడు అంటూ అంతా నిర్థారణకు వచ్చారు. బిగ్‌ బాస్‌ ఇంట్లో కౌశల్‌ తో పలు సార్లు విభేదించిన బాబు గోగినేని బయటకు వచ్చిన తర్వాత కూడా కౌశల్‌ ఆర్మీతో చిన్నపాటి యుద్దమే చేశాడు.

కౌశల్‌ ఆర్మీ ఫేక్‌ అని - కౌశల్‌ ఆర్మీ పెయిడ్‌ ఆర్మీ అని - నీలిమ కౌశల్‌ కౌశల్‌ ఆర్మీని రన్‌ చేస్తుందని బాబు గోగినేని పలు కామెంట్స్‌ చేశాడు. కౌశల్‌ విజేతగా నిలిచిన తర్వాత కూడా ఇది డబ్బులిచ్చి కొనుకున్న గెలుపు అంటూ ఎద్దేవా చేశాడు. బాబు గోగినేని వ్యాఖ్యలపై కౌశల్‌ కూడా చాలా సార్లు రియాక్ట్‌ అయ్యాడు. తాజాగా మరోసారి ఒక చర్చ కార్యక్రమంలో బాబు గోగినేని - కౌశల్‌ మరియు నీలిమ కౌశల్‌ లు పాల్గొన్నారు. ఆ సమయంలో వీరి మద్య చర్చ వాడి వేడిగా సాగింది.

కౌశల్‌ ఆర్మీ అనేది బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ప్రారంభంకు ముందే అయ్యిందని - ముందే అంతా ప్లాన్‌ చేసుకుని - కుటుంబ సభ్యులతో బయట మేనేజ్‌ చేయించుకుంటూ లోపల కౌశల్‌ గేమ్‌ ఆడాడు అంటూ బాబు గోగినేని ఆరోపించాడు. అందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ బాబు అన్నాడు. బాబు వ్యాఖ్యలకు నీలిమ స్పందిస్తూ.. కౌశల్‌ ఆర్మీకి డబ్బులు ఖర్చు చేసినట్లుగా మీ వద్ద ప్రూప్‌ ఉంటే మాట్లాడండి - లేదంటే మాట్లాడొద్దు అంది. కౌశల్‌ పేరుతో సోషల్‌ మీడియాలో కొన్ని వేల అకౌంట్స్‌ ఉన్నాయి. వాటన్నింటికి కూడా డబ్బులిచ్చి క్రియేట్‌ చేయించడం, లేదంటే సొంతంగా క్రియేట్‌ చేయడం సాద్యమేనా అంటూ ఆమె ప్రశ్నించింది.

కౌశల్‌ స్పందిస్తూ.. బాబు గోగినేనికి సోషల్‌ మీడియాపై మినిమం పట్టు కూడా లేనట్లుందని - ఆయన మొదట సోషల్‌ మీడియా గురించి అవగాహణ తెచ్చుకుని ఆ తర్వాత మాట్లాడాలన్నాడు. ఆర్మీ స్టార్ట్‌ చేసి బిగ్‌ బాస్‌ లోకి వెళ్లి నిమ్మకాయ పిండమని కిరీటికి డబ్బులు ఇచ్చానా - ఇతరులు నన్ను టార్గెట్‌ చేయాలని చూశానా అంటూ కౌశల్‌ ప్రశ్నించాడు. అంతగా నీలిమ - కౌశల్‌ గట్టిగా వాదిస్తున్నా కూడా కౌశల్‌ ఆర్మీ పెయిడ్‌ ఆర్మీనే అంటూ బాబు గోగినేని బల్ల గుద్ది మరీ చెప్పాడు. ఈ చర్చ కార్యక్రమం అంతా కూడా సీరియస్‌ గా - వాడి వేడిగా సాగింది.
Tags:    

Similar News