షాకింగ్‌: `ప‌ద్మావ‌తి`విడుద‌ల వాయిదా!

Update: 2017-11-19 16:12 GMT
రాణి ప‌ద్మిని దేవి జీవిత చ‌రిత్ర ఆధారంగా ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌తి` చిత్రం విడుద‌లపై పెను దుమారం రేగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌ద్మావతిగా న‌టించిన దీపికా ప‌దుకొనే - భ‌న్సాలీల త‌ల‌లు తెగ న‌రుకుతామ‌ని రాజ్ పుత్ క‌ర్ణి సేన నుంచి బెదిరింపులు కూడా వ‌స్తున్న సంగతి విదిత‌మే. ఆ సినిమా విడుద‌లైతే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి....కేంద్రానికి లేఖ రాశారు. ఆ చిత్రంలో రాణి ప‌ద్మిని దేవిని కించ‌ప‌రిచేలా ఉన్న స‌న్నివేశాలు తొల‌గించేవ‌ర‌కు విడుద‌ల‌ను ఆపాల‌ని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే..... సమాచార - ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ప్ర‌ముఖ చిత్ర‌కారులు - సినీ ప్ర‌ముఖులు - రాజ్ పుత్ వ‌ర్గ ప్ర‌ముఖుల‌తో ఓ కమిటీని ఏర్పాటు చేయాల‌ని కోరారు. అంతేకాదు, వారితో ఆ చిత్ర క‌థ‌ను చ‌ర్చించి అవ‌స‌ర‌మైన మార్పులు చేసేలా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సూచించాల‌ని కోరారు. రాజ్ పుత్ ల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా అవ‌స‌ర‌మైతే చిత్ర క‌థ‌లో మార్పులు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సెన్సార్ బోర్డు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, విడుద‌ల త‌ర్వాతి పర్యవసానాల్ని దృష్టిలో ఉంచుకుని 'పద్మావతి'ని రీసెన్సార్ చేయాలని రాజస్థాన్ సర్కార్ కోరుకుంటోంది.

రాజ్ పుత్ ల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప‌ద్మావ‌తి చిత్ర విడుద‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో `ప‌ద్మావతి` చిత్ర విడుద‌లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌ తేదీని ప్రకటిస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వ‌యోకోమ్ 18 ప్ర‌తినిధి ఒక‌రు అధికారికంగా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని స్వ‌చ్ఛందంగా 'పద్మావతి` చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. రాజ్ పుత్ ల రాజ‌సం - గౌర‌వం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇనుమ‌డింపజేసేలా సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని, ఇందులో ఏ వ‌ర్గం వారిని కించ‌ప‌ర‌చ‌లేద‌ని ఆ ప్ర‌తినిధి తెలిపారు. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వించేలా ఈ అద్భుత క‌ళాఖండాన్ని రూపొందించామన్నారు. సెన్సార్ బోర్డుపై, భార‌తీయ చ‌ట్టాల‌పై త‌మ‌కు గౌర‌వ‌ముంద‌న్నారు. త్వ‌ర‌లోనే ఆ చిత్ర విడుద‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు ల‌భిస్తాయ‌ని త‌మ‌కు న‌మ్మ‌క‌ముంద‌న్నారు. అన్ని అడ్డంకులు తొల‌గిపోయాక త్వ‌ర‌లోనే ఆ చిత్ర తాజా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డ‌డంతో ప‌ద్మావ‌తిపై రాజ్ పుత్ ల పంతం నెగ్గిన‌ట్ల‌యింద‌ని నెటిజ‌న్లు ...సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Tags:    

Similar News