‘బాబా’కు మాటలు రాయమని రజినీ అడిగితే..

Update: 2016-06-27 06:29 GMT
ఇప్పుడైతే పరుచూరి బ్రదర్స్ ను పట్టించుకోవడం మానేశారు కానీ.. దశాబ్దం కిందటి వరకు వాళ్లే టాలీవుడ్ టాప్ రైటర్స్. దాదాపు మూడు దశాబ్దాల పాటు వారి కలాలు తెలుగు సినిమాను ఏలాయి. 300కు పైగా సినిమాలకు రచన చేసిన ఈ సోదరులు.. సౌత్ ఇండియా అంతటా చాలా ఫేమస్. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం తన సినిమా ఒకదానికి మాటలు రాయమని అడిగాడట. కానీ అది సాధ్యం కాదని చెప్పేశారట పరుచూరి బ్రదర్స్. ఆ అనుభవం గురించి ‘కబాలి’ ఆడియో వేడుకలో పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

‘‘రజినీకాంత్‌ తో మా పరుచూరి సోదరులకు గొప్ప అనుబంధం ఉంది. మోహన్ బాబును కలవడానికి వచ్చినపుడల్లా రజినీ మమ్మల్ని కలిసేవాడు. ‘సమరసింహారెడ్డి’ సినిమా చూసి.. అందులో బాలయ్యకు ఎస్పీ అయిన సత్యనారాయణ దండం పెట్టే సన్నివేశం గురించి తెలుసుకుని.. ఈ ఆలోచన ఎవరిది అని అడిగారు. ఆయనకు ఆ సన్నివేశం అంత బాగా నచ్చింది. అలాగే వంశానికొక్కడు సినిమా చూసి.. ఈ కథ తనకు ఇచ్చి ఉంటే ఏడాది ఆడే సినిమా చేసేవాడినని అన్నారు. మాకు రజినీతో పని చేసే గొప్ప అవకాశం కూడా వచ్చింది. ‘బాబా’ సినిమాకు మాటలు రాయమని అడిగారు. కానీ మేం ‘లిప్’కు మాటలు రాయమని చెప్పేశాం. డబ్బింగ్ సినిమాలకు రాయడం మాకిష్టం లేదు. ఐతే ఈ విషయంలో రజినీని క్షమాపణలు కోరాం. రజినీకాంత్ వ్యక్తిత్వం చాలా గొప్పది. అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్‌ గా ఉంటారు. ఒకసారి ఏదో ఆడియో వేడుకకు ఆయన్ని పిలిస్తే.. అందరికంటే ముందు వచ్చి ఓ మూలన మామూలుగా కూర్చుండిపోయారు. ఆ ఫొటో చాలా పెద్ద సెన్సేషన్ అయింది. రజినీకాంత్ ఆరా ఎంత గొప్పదంటే.. ఆయన అమెరికాలో ఉన్నా అది ఇక్కడికీ కొడుతూ ఉంటుంది. రజినీ ప్రతి సినిమాలోనూ ఆయన ఏం చేస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తారు. ఆయన ఈసారి ‘కబాలి’లో కబాలిరా అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
Tags:    

Similar News