బిగ్ బాస్ ఆపాలంటూ కోర్టుకు ఎక్కారు!

Update: 2019-06-20 04:41 GMT
ప్ర‌ముఖుల భాగ‌స్వామ్యంతో ఉండే కార్య‌క్ర‌మాల మీదా.. టీవీ షోల మీదా.. సినిమాల‌పైనా ప‌లు అభ్యంత‌రాల‌తో కోర్టుకు వెళ్లే వారు కొంద‌రు ఉంటారు. ఇలాంటి వారి సంఖ్య త‌మిళ‌నాడులో ఎక్కువ‌గా ఉంటుంది. టీవీ.. సినిమాల‌పై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ.. వాటిని నిలిపివేయాలంటూ పిటిష‌న్లు పెట్టే వైనం అక్క‌డ ఎక్కువ‌గా ఉంటుంది.

ఏదో ఒక పాయింట్ ప‌ట్టుకొని కోర్టుల‌కు వెళ్ల‌టంతో స‌ద‌రు సినిమా.. టీవీ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వారు కిందా మీదా ప‌డుతుంటారు. తాజాగా ఇలాంటి ఉదంత‌మే ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. బిగ్ బాస్ రెండు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి.. మూడో సీజ‌న్ ను త్వ‌ర‌లో తెర మీద‌కు తెద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికి షాక్ త‌గిలే ప‌రిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ ను నిలిపివేయాల‌ని.. ఈ షో టెలికాస్ట్ కాకుండా ఆపుతూ కోర్టు నిర్ణ‌యం తీసుకోవాలంటూ పిటిష‌న్ మ‌ద్రాసు హైకోర్టులో దాఖ‌లైంది.

బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటార‌ని.. ఇలాంటివి పిల్ల‌ల మీద ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని.. అందుకే ఈ షోకు అనుమ‌తి ఇవ్వొద్దంటూ పిటిష‌న్ దారుడు కోరారు. ప్ర‌చారం కోస‌మో.. కొత్త వివాదాన్ని తెర మీద‌కు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇలాంటివి చోటు చేసుకుంటాయ‌ని చెబుతుంటారు. విశ్వ క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ చేసే బిగ్ బాస్ సీజ‌న్ 3 కూడా ఆయ‌నే హోస్ట్ చేస్తార‌ని చెబుతున్నారు. మ‌రి.. తాజా పిటిష‌న్ పై మ‌ద్రాసు హైకోర్టు ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి.
    

Tags:    

Similar News