ప్రకాష్ రాజ్ క్లాసిక్ ఆన్సర్

Update: 2016-10-02 17:30 GMT
ఎంత బిజీ నటుడికైనా సరే.. ఏదో ఒక దశలో అవకాశాలు తగ్గక మానవు. ప్రకాష్ రాజ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేసిన ఆయనకు ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. ఈ ఖాళీలో ఆయన చాలా పనులే చేస్తున్నారు. ఐతే ప్రకాష్ రాజ్ లేకుండా సినిమాలు తీయలేని దర్శకులు కొందరు టాలీవుడ్లో కనిపిస్తారు. అలాంటి దర్శకులు కూడా ఈ మధ్య ప్రకాష్ రాజ్ లేకుండానే పని కానిచ్చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇదే మాట ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన దీనికి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ‘‘నేను లేకపోతే సినిమా తీయలేమనే అబద్ధాన్ని అప్పుడు వాళ్లు నమ్మారు. నేను లేకుండా కూడా సినిమా తీయొచ్చనే నిజాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు’’ అని భలేగా జవాబిచ్చాడు ప్రకాష్ రాజ్.

తన పనైపోయిందని అనే వాళ్లకు ప్రకాష్ రాజ్ గట్టిగానే రిటార్ట్ ఇచ్చాడు. తనతో ఎవరు సినిమాలు చేసినా.. చేయకపోయినా తన బతుకు నేను బతుకుతూనే ఉంటానన్నాడు. నటుడిగా తాను ఏ రోజూ ఖాళీగా లేనని.. ఇప్పుడు కూడా తెలుగు-తమిళం-కన్నడ-హిందీ భాషల్లో నటిస్తున్నానని.. అలాగే వ్యవసాయం చేస్తూ.. తాను దత్తత తీసుకున్న గ్రామంలో పనులు చేయిస్తూ.. దర్శకత్వం చేస్తూ.. దేశాలు తిరుగుతూ తీరిక లేకుండా గడపుతున్నానని.. ఖాళీగా ఉన్నవాళ్లే తాను ఖాళీ అయిపోయానని కామెంట్లు చేస్తారని ప్రకాష్ రాజ్ అన్నాడు. తనకు సినిమానే జీవితం కాదని.. జీవితంలో సినిమా భాగమని.. సినిమా ఒక్కటే చూపించి తన మీద కామెంట్లు చేస్తే తానేమీ చేయలేనని ఈ విలక్షణ నటుడు స్పష్టం చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News