పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా..?

Update: 2022-10-22 23:30 GMT
డేరింగ్ అండ్ డేషింగ్ డైరెక్టర్ పూరీ జగ‌న్నాథ్ ఇటీవల 'లైగర్' సినిమాతో డబుల్ డిజాస్టర్ అందుకున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. దీంతో పూరీ పాన్ ఇండియా ఆశలపై నీళ్లు చల్లడమే కాదు.. ఆయన చుట్టూ అనేక పుకార్లు వ్యాపించాయి.

'లైగర్' సినిమా రిలీజ్ అవ్వకముందే విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ 'జనగణమన' (JGM) అనే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుంచి అనేక మంది స్టార్ హీరోల చేతులు మారి.. చివరకు వీడీ చెంతకు చేరింది.

పూరి కనెక్ట్‌ మరియు శ్రీకర స్డూడియోస్ బ్యానర్లపై JGM చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీనికి ఛార్మి కౌర్‌ - దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు. ముంబైలో కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసారు. అయితే 'లైగర్' ప్లాప్ తో ఈ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయని కథనాలు వచ్చాయి. 'జనగణమన' చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని రూమర్స్ వచ్చాయి.

జేజీఎమ్ ఆగిపోయిన నేపథ్యంలో పూరీ జగన్నాథ్ కు హీరో దొరకడం లేదని.. 'లైగ‌ర' ఫెయిల్యూర్‌ తో ఆర్ధికంగా కూడా దివాళ తీశాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం 'జనగణమన' సినిమా ఆగిపోలేదని తెలుస్తోంది. కాకపోతే విజయ్ దేవరకొండతో కాకుండా మరో హీరోతో చేయడానికి పూరీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ చేసుకున్న పూరీ.. బాలీవుడ్ హీరోలతో టచ్ లో ఉంటున్నాడట. రణవీర్ సింగ్ - విక్కీ కౌశల్ వంటి హీరోలతో సినిమా చేసే ఆలోచనలో వున్నాడట. అంతేకాదు తన డ్రీం ప్రాజెక్ట్ ని ఇద్దరు హీరోలో ఎవరో ఒకరితో చేసే అవకాశం ఉందని.. దీని కోసం మళ్ళీ ముంబైలోనే మకాం వేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

'లైగర్' సినిమా కోసం గత మూడేళ్ళుగా ముంబైలోనే ఉన్న పూరీ జగన్నాథ్.. ఇటీవల తన విలాసవంతమైన ఆఫీస్ స్థలాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ కు వచ్చినట్లు టాక్ వచ్చింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. ఆఫీస్ అక్కడే వుందని తాజాగా వినిపిస్తోంది. 'జనగణమన' పనుల అక్కడి నుంచే జరుగుతాయని అంటున్నారు. ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు బడ్జెట్ పెట్టడానికి బాలీవుడ్ బడా బ్యానర్స్ ముందుకు వస్తున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.

ఏదేమైనా ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ చలామణి అయిన పూరీ జగన్నాధ్.. 'లైగర్' ప్లాప్ తో ఎన్నడూ లేనంత నెగిటివిటీని కూటగట్టుకున్నారు. అందుకే తన తదుపరి సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూరీ సైతం ఈసారి పాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టడానికి ప్లానింగ్స్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News