హిట్‌ మూవీకి సీక్వెల్‌ ప్రకటించిన హీరో

Update: 2019-03-12 13:17 GMT
హీరోగా రాజశేఖర్‌ కెరీర్‌ ముగిసింది, జగపతిబాబు మాదిరిగా రాజశేఖర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాల్సిందే అని అంతా భావించారు. విలన్‌ పాత్రలకు మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలకు కూడా రాజశేఖర్‌ ను పలువురు సంప్రదించారు. అయితే పాత్ర, కథ బాగాలేదని కొన్నింటికి నో చెప్పగా - కొన్నింటిని మాత్రం పక్కకు పెట్టాడు. నేడో రేపో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడం ఖాయం అనుకున్న సమయంలో రాజశేఖర్‌ కు అనూహ్యంగా 'గరుడవేగ' మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. దశాబ్ద కాలం పాటు వేచి చూసిన సక్సెస్‌ రావడంతో రాజశేఖర్‌ మళ్లీ హీరోగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

'గరుడవేగ' చిత్రం తర్వాత రాజశేఖర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో 'కల్కి' అనే పీరియాడిక్‌ మూవీని చేస్తున్నాడు. మరి కొన్ని నెలల్లో ఆ సినిమా పూర్తి అవ్వబోతుంది. ఒక వైపు 'కల్కి' చిత్రంలో నటిస్తూనే తాజాగా జరిగిన మా ఎన్నికల్లో రాజశేఖర్‌ పార్టిసిపేట్‌ చేశాడు. నరేష్‌ ప్యానెల్‌ లో ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందాడు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ తన సినిమాల గురించి కూడా చిన్న క్లారిటీ ఇచ్చాడు. 'కల్కి' చిత్రం తర్వాత తాను 'గరుడవేగ' సీక్వెల్‌ లో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గరుడవేగ' చిత్రంకు సీక్వెల్‌ చేయాలనే నిర్ణయం చాలా పెద్ద సాహసంగా చెప్పుకోవాలి. రాజశేఖర్‌ మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకోకుండా ఆ సినిమాను ఏకంగా 25 కోట్లతో తీశారు. సీక్వెల్‌ అంటే మళ్లీ అదే స్థాయిలో తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతటి సాహసం ఎవరు చేసేందుకు ముందుకు వస్తారనేది చూడాలి. మరో వైపు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కూడా ఇతర ప్రాజెక్ట్‌ లతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గరుడవేగ 2 చిత్రంకు దర్శకుడు ఎవరు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. సీక్వెల్‌ కు కూడా ప్రవీణ్‌ సత్తారు కావాలి అంటే రాజశేఖర్‌ చాలా కాలం వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. మరి అలా వెయిట్‌ చేస్తాడా లేదంటే మరో దర్శకుడితో సీక్వెల్‌ ను షురూ చేస్తాడా అనేది చూడాలి.

గరుడవేగ సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా రాజశేఖర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే స్టోరీ లైన్‌ రెడీ అయ్యి ఉంటుంది. ఆ స్టోరీ లైన్‌ ను ఎవరు ఇచ్చారు, ప్రవీణ్‌ సత్తారు ఆ స్టోరీ లైన్‌ పట్ల ఆసక్తిగా ఉన్నాడా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
Tags:    

Similar News