ఎన్టీఆర్ తో గ్యాప్ రావడంపై రాజీవ్ కనకాల స్పందన..!

Update: 2021-07-25 05:37 GMT
జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ కి ఎంతో వాల్యూ ఇస్తారని.. ఒక్కసారి స్నేహం చేస్తే ప్రాణం ఇస్తారని ఇండస్ట్రీలో అందరూ చెబుతూ ఉంటారు. రాజీవ్ కనకాల - సమీర్ - శ్రీనివాస్ రెడ్డి - రాఘవ - రఘు వంటి సినీ ప్రముఖులు తారక్ తో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.

ఎన్టీఆర్ తో ఫ్రెండ్ షిప్ చేస్తే ప్రాణమిస్తారని.. తనలాగా క్లోజ్ గా ఉండే స్నేహితులు పదిహేను మంది దాకా ఉన్నారని.. తాను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టే ఎక్కువ ప్రొజెక్టు అయ్యానని రాజీవ్ చెప్పారు. తారక్ తో ఉంటే సరదాగా ఉంటుందని.. ఓవర్ నైట్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి స్పెండ్ చేసే వాళ్లమని అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా 24 గంటలు అంటి పెట్టుకుని ఉంటే బాగుందడు కదా.. అందుకే మా మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని.. వీలు కుదిరినప్పుడల్లా ఇప్పటికీ కలుస్తుంటాం అని కనకాల చెప్పారు.

ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయినప్పుడు తనతో పాటు కార్ లో ఉన్నానని.. మధ్య సీట్ లో కూర్చొని ఉన్నానని.. దేవుడి దయ వల్ల బయటపడ్డామని రాజీవ్ అన్నారు. ఈ సందర్భంగా తారక్ తో ఎక్కువ సినిమాలు చేయకపోడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. ''ఎన్టీఆర్ నటించే ప్రతీ సినిమాలో నేను ఉండాలని కోరుకుంటారు. దర్శకులకు నన్ను రికమెండ్ చేస్తారు. కానీ డైరెక్టర్స్ ని ఫోర్స్ చేయడం బాగుందని నేనే వద్దు అంటాను. ఒకవేళ దర్శకులు ఆ పాత్రకు నేను సూట్ అవుతాను అనుకుంటే బాగుంటుంది. వాళ్ళని ఫోర్స్ చేసినా బాగోదు తారక్ అని చెప్తాను'' అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

కాగా, ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1' 'ఆది' 'నాగ' 'అశోక్' 'యమదొంగ' 'బాద్ షా' 'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రాల్లో రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. చివరగా 'జనతా గ్యారేజ్' లో తారక్ తో కలసి నటించిన రాజీవ్.. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది రాజమౌళి దర్శకత్వంలో కనకాల రాజీవ్ నటిస్తున్న ఐదో సినిమా.
Tags:    

Similar News