ఈ పాటను వాడుకుంటే ‘జైలవకుశ’ బ్లాక్ బస్టరే..

Update: 2017-09-06 17:30 GMT
కొన్నిసార్లు కేవలం పాటలతోనే సినిమాలు ఆడేస్తుంటాయి. పాటల్ని సరిగ్గా వాడుకుని.. వాటి చుట్టూ కథను సరిగ్గా అల్లుకుని.. పాటల ద్వారా కథను సరిగ్గా చెప్పగలిగితే అవే సినిమాను ఆడించేస్తాయి. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు ‘జై లవకుశ’లో కూడా అలాంటి పాట ఒక వినిపిస్తోంది. ఆ పాటను సరిగ్గా వాడుకుని.. దానికి దగ్గట్టుగా ప్రధాన పాత్రను తీర్చిదిద్ది.. మంచి సన్నివేశాలు తీర్చిదిద్దుకుని ఉంటే.. ‘జై లవకుశ’ ప్రేక్షకుల్ని కట్టిపడేసే అవకాశముంది. జై పాత్రకు సంబంధించిన రావణా.. అంటూ సాగే పాట గురించి ఇక్కడ మాట్లాడుతోంది.

నిజంగా సినిమాలో జై పాత్ర ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈ పాత్ర లక్షణాల్ని చెబుతూ సాగే ‘రావణా..’ పాట అయితే అదిరిపోయింది. ఆ పాత్ర ఎంత క్రూరమైందో.. దానికి ఎంతటి ఆకర్షణ ఉందో చెబుతూ సాగే లిరిక్స్ కట్టి పడేస్తాయంతే. ‘‘చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక.. ముజ్జగాల ఏక కాల పలు రకాల ధ్వంసక.. ఖడ్గ భూమి కార్మిక కదన రంగ కర్షక.. గ్రామ నగర పట్టాల సకల జనాకర్షక..’’ అంటూ ఈ పాత్రను భలేగా వర్ణించాడు చంద్రబోస్.

‘‘అందమైన రూపమున్న అతి భయంకర..’’.. ‘‘పాపలాగ నవ్వుతున్న ప్రళయ భీకర’’.. ఈ లిరిక్స్ జై పాత్రలోని కుటిలత్వాన్ని చాటి చెబుతాయి. ఊరికే లిరిక్స్ ద్వారా ఈ పాత్ర ప్రత్యేకతను చాటి చెప్పడం కాకుండా.. వీటికి తగ్గట్లే సినిమాలో పాత్రను కూడా తీర్చిదిద్దడం అన్నది కీలకం. ఆ పని బాబీ అండ్ కో చేయగలిగి ఉంటే ఈ క్యారెక్టర్ మామూలుగా పేలదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి టీజర్ జనాల్లో మంచి ఆసక్తి రేకెత్తించింది. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ చేయడం.. పైగా ఆ పాత్రకు నత్తి ఉండటం అన్నది విపరీతమైన క్యూరియాసిటీ తీసుకొచ్చింది. సినిమాకు ఈ పాత్రే ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంచనాలతో ఉన్నారు ప్రేక్షకులు. ఈ విషయంలో అంచనాలు అందుకోగలిగితే ‘జై లవకుశ’ జయకేతనం ఎగురవేసినట్లే.
Tags:    

Similar News