ఆ సినిమాని తిర‌గేసి తీసిన‌ట్టున్నాడే?

Update: 2022-11-23 08:30 GMT
వెండితెర‌పై ట్రాజెడీ ఎండింగ్ తో రూపొంది ఫీల్ గుడ్ సినిమా అనిపించుకున్న వాటిని బాగా గుర్తు పెట్టుకుంటాం. ఆ సినిమా క‌లిగించే ఇంపాక్ట్ అలా వుంటుంది. దానికి ద‌గ్గ‌ర‌గా ఏ సినిమా వ‌చ్చినా ఇట్టే ప‌ట్టేస్తుంటాం. మొన్న చూసిన సినిమాలా వేందే.. అదే క‌థ‌ని తిర‌గేసి చెబుతున్నారా? అని ఆరా తీయ‌డం మొద‌లు పెడ‌తాం. ఒక వేళ అదే ద‌ర్శ‌కుడు చేసిన సినిమా అయితే ఇంకా లోతుగా ఆలోచించి మ‌ళ్లీ అదే క‌థ‌ని తిర‌గేసి తీసేస్తున్నాడా? అనే అనుమానాలు మ‌న‌లో మొద‌ల‌వుతాయి.

ఎందుకంటే క‌థ‌ల‌ని తిర‌గేసి కొత్త క‌థ అనిపించ‌డంలో మ‌న వాళ్లు దిట్ట‌లు కాబ‌ట్టి. గ‌త కొన్నేళ్ల క్రితం హిందీలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకున్న మూవీ 'సాజ‌న్‌'. సల్మాన్ ఖాన్‌, మాధురీ దీక్షిద్, సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీలోని పాత్ర‌ల‌ని మార్చేసి తెలుగులో 'అల్ల‌రి ప్రియుడు'గా చేసి కె. రాఘ‌వేంద్ర‌రావు హిట్టు కొట్టిన విష‌యం తెలిసిందే. తెలుగుకు వ‌చ్చే స‌రికి హీరోల‌ని హీరోయిన్ లుగా, హీరోయిన్ పాత్ర‌ని హీరోగా మార్చి తెలియ‌కుండా మ్యాజిక్ చేశారు.

ఇప్ప‌డు అలాంటి మ్యాజిక్ నే సాయి రాజేష్ నీలం చేయ‌బోతున్నాడా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఇటీవ‌ల జాతీయ స్థాయిలో అవార్డుని సొంతం చేసుకున్న 'క‌ల‌ర్ ఫొటో' సినిమాకు సాయి రాజేష్ నీలం క‌థ అందించాడు. ఇందులో న‌ల్ల‌గా  హీరో ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించ‌డం.. ఆ త‌రువాత త‌న వాళ్ల కార‌ణంగా మృతి చెంద‌డం వంటి ట్రాజెడిక్ ఎండింగ్ తో రూపొందిన ఈ మూవీ 'ఆహా' ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

జాతీయ స్థాయిలో పుర‌స్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇప్ప‌డు ఇదే క‌థ‌ని తిర‌గేసి సాయి రాజేష్ నీలం రూపొందించిన‌ట్టుగా కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా సాయి రాజేష్ నీలం రూపొందించిన లేటెస్ట్ మూవీ 'బేబీ'. ఈ మూవీ టీజ‌ర్ ని తాజాగా రిలీజ్ చేశారు. స్కూల్ డేస్ జ్ఞాప‌కాల‌ని గుర్తు చేస్తూ సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. అయితే ఇందులో హీరో, హీరోయిన్ ల పాత్ర‌ల‌ని మ‌లిచిన తీరు 'క‌ల‌ర్ ఫోటో'నిగుర్తు చేస్తోంది.

అంతులో హీరో న‌ల్ల‌గా వుంటే.. ఇందులో హీరోయిన్ ని న‌ల్ల‌గా చూపించాడు. ఇద్ద‌రు ప్రేమ‌లో వుంటే మ‌ధ్య‌లో మ‌రో గొప్పింటి అబ్బాయి ఎంట‌ర్ కావ‌డం.. వంటి సీన్ లు చూస్తుంటే క‌ల‌ర్ ఫొటోని తిర‌గేసి క్యారెక్ట‌ర్ ల‌ని మార్చి కొత్త నేప‌థ్యంలో అదే క‌థ‌ని మ‌ళ్లీ తీసిన‌ట్టుగా అనిపిస్తోంద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News