టాలీవుడ్ సినిమా.. హిందీలోకి డబ్ అయి.. అక్కడి రికార్డులన్నీ తుడిచిపెట్టేయడాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. బాహుబలి2 రికార్డులపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ విషయంలో హిందీ మీడియా ముందుంటే.. అక్కడి స్టార్ హీరోలు తమ మనోభావాన్ని చూచాయగా చెబుతున్నారు కూడా.
ఇప్పుడు బాహుబలి2 హిందీ వెర్షన్ కలెక్షన్స్ 500 కోట్లకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ హిందీలో కనీసం 400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన మూవీ కూడా బాలీవుడ్ లో లేదు. అందుకే బాహుబలి2పై బాలీవుడ్ లో కడుపుమంట పెరిగిపోతోంది. ఈ నెల 23న సల్మాన్ ఖాన్ మూవీ ట్యూబ్ లైట్ విడుదల కానుంది. ఈ చిత్రం బాహుబలి2 రికార్డులన్నీ తుడిచిపెట్టేయాలని మరో హీరో వివేక్ ఒబెరాయ్ అంటున్నాడు. ఈద్ కి వచ్చే సల్మాన్ ఖాన్ సినిమాలకు బోలెడంత క్రేజ్ ఉంటుందనే మాట వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో అంటే గొంతెమ్మ కోరిక అనాల్సిందే. ఒక సింపుల్ లైట్ వేస్తే బాహుబలి కలక్షన్లు ఎగిరిపోతాయా బాసూ?? మీ ఓవరాక్షన్ కాకపోతే!!
ఇప్పటికే దంగల్ చైనా కలెక్షన్స్ చూపించి బాహుబలి2ని తక్కువ చేసేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తోంది. కానీ రాజమౌళి తీసిన చిత్రం ఇంకా చైనాలో రిలీజ్ కాలేదనే సంగతి మర్చిపోతోంది. అయినా లోకల్ గానే 1000 కోట్లకు పైగా నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను సాధించిన అరుదైన రికార్డ్ బాహుబలి ఖాతాలో ఉంది. దీన్ని అందుకోవడం ఇప్పటిలో సాధ్యమయ్యే విషయమేమీ కాదు. ఇలా జరగాలంటే.. దేశంలోని అన్ని ఇండస్ట్రీలలోను ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసే సినిమా రావాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/