అర్జున్ రెడ్డి గ్రాండ్ సక్సెస్ తో బాలీవుడ్ దృష్టిని కూడా తన వైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడున్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో ఒక్క సినిమాతోనే చోటు దక్కించుకున్నాడు. ఆ సినిమా విడుదల అయినప్పుడు మహేష్ బాబు ప్రత్యేకంగా ఆ టీంని అభినందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సందీప్ తో మహేష్ ఒక సినిమా చేయాలనుకున్నాడు అనే దాని గురించి కదా రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అటు మహేష్ , ఇటు సందీప్ దీని గురించి ఎక్కడా స్పందించలేదు. ప్రస్తుతం సందీప్ వంగా అర్జున్ రెడ్డి హింది రీమేక్ కోసం కమిట్ అయ్యాడు. అర్జున్ కపూర్ హీరోగా రూపొందే ఆ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాని ఇది ఒప్పుకోవడానికంటే ముందే సందీప్ మహేష్ ని, నమ్రతా శిరోద్కర్ ను కలిసి దీని గురించి చెప్పి అనుమతి తీసుకున్నాడనే టాక్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
దీనికి కారణం లేకపోలేదు. సందీప్ తో ఓ సినిమా చేయాలనీ గట్టిగా డిసైడ్ అయిన మహేష్ తను చెప్పిన ఒక లైన్ నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట. అదే పనిలో ఉన్న సందీప్ కు బాలీవుడ్ రీమేక్ ఆఫర్ రావడంతో నిర్ణయం తీసుకునే ముందు మహేష్ ని కలిసినట్టు వార్త. భరత్ అను నేను తర్వాత తన 25వ సినిమా వంశీ పైడిపల్లితో చేయాల్సి ఉంది కనక ఎలాగూ ఏడాదికి పైగా పడుతుంది కాబట్టి ఆ లోపు హింది సినిమా పూర్తి చేసుకుని రమ్మని నమ్రతా చెప్పినట్టు వినికిడి. ఇందులో ఇది నిజమో కాదో ఇరు వర్గాలు చెప్పేంత సీన్ ప్రస్తుతానికి లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో నిజమైనా సందీప్ లాంటి ఇంటెన్సిటీ సబ్జెక్టు డీల్ చేయగలిగే దర్శకుడి సినిమాలో కనక మహేష్ నటిస్తే అది ఎలా ఉంటుందో ఊహలకు కూడా అందదు.
మహేష్ భరత్ అను నేను షూటింగ్ పూర్తి చేసే క్రమంలో మూడు నెలల దాకా అందుబాటులోకి రాడు. ఇక వంశీ పైడిపల్లి సినిమా జూన్ నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అల్లరి నరేష్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్టు టాక్. బ్రహ్మోత్సవం - స్పైడర్ ఫలితాల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రిన్స్ కు భరత్ అను నేను చాలా కీలకంగా మారింది.