ట్రెండీ టాక్: సంక్రాంతి రేసులో ఎవ‌రు ముందంజ‌?

Update: 2022-12-01 23:30 GMT
ప్ర‌తియేటా సంక్రాంతి సీజ‌న్ లో తెలుగు రాష్ట్రాల‌ థియేట‌ర్ల‌లో సంద‌డి గురించి తెలిసిందే. 2023 సంక్రాంతి సీజన్ లో అగ్ర హీరోల‌ సినిమాలు  భారీ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేర్ వీరయ్య`.. న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ `వీరసింహారెడ్డి`... ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ `వార‌సుడు` (వరిసు-త‌మిళం) రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర ప‌నుల‌ చివరి దశలో ఉన్నాయి. విడుదలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ లో వేగం  పెంచిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో చిరంజీవి-బాల‌య్య సినిమాల‌కు ధీటుగా విజ‌య్ సినిమాని ఘ‌నంగా తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌లోకి దించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు.. ఈ సినిమా బిజినెస్ కూడా వేగంగా పూర్తవుతోంద‌నేది ట్రేడ్ వ‌ర్గాల మాట‌. చిరంజీవి -బాల‌కృష్ణ సినిమాల కంటే ముందే ప్రీబిజినెస్ లాక్ అవుతోంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి కార‌ణం వాల్తేరు వీర‌య్య- వీర‌న‌ర‌సింహారెడ్డి చిత్రాల‌కు అధిక మొత్తాల‌ను కోట్ చేయ‌డ‌మేన‌ని కూడా పంపిణీదారులు స‌హా ఎగ్జిబిషన్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.  విజ‌య్ `వార‌సుడు` సినిమా క‌చ్ఛితంగా ఫ్యామిలీ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంద‌ని.. ధ‌ర‌ల ప‌రంగానూ రీజ‌న‌బుల్ గా ఉండ‌డం లాభిస్తుంద‌ని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది.

ధ‌ర‌లు గీత దాటేయ‌డం వెన‌క కార‌ణం?

ఇటీవ‌ల పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమాల బడ్జెట్లు అమాంతం పెరిగాయి. రెండు మూడు భాష‌ల రిలీజ్ ల‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాల్ని రాజీకి రాకుండా తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ ఖ‌ర్చుతో అగ్ర హీరోల సినిమాలు తెర‌కెక్కుతుండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టే రేటును కూడా నిర్మాత‌లు గ‌రిష్ఠ సంఖ్య‌ల్ని ఫిక్స్ చేస్తున్నారు. దాంతో పంపిణీదారులు పెద్ద మొత్తంలో చెల్లించి రైట్స్ కొనుక్కోవాల్సిన స‌న్నివేశం ఉంది. కాస్ట్ ఫెయిల్యూర్ అని దీనిని ప్ర‌స్థావించ‌క‌పోయినా స్టార్ హీరోలు స్టార్ డైరెక్ట‌ర్ల పారితోషికాల‌తో పాటు.. ఇత‌ర పెట్టుబ‌డులు భారీగా ఉంటున్నాయి. అలాగే స్టార్లు భారీగా కాల్షీట్లు కేటాయించి ప‌ని చేస్తున్నారు. దీంతో సినిమాల నిర్మాణానికి అద‌న‌పు భారం పెరిగింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.
 
సాధారణంగా ఒక సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసే బాలకృష్ణ వీర సింహారెడ్డి కోసం బ‌ల్క్ కాల్షీట్ల‌ను కేటాయించారు. ఇప్పటికే 140 రోజుల సమయం కేటాయించార‌ని స‌మాచారం. దీంతో పాటే బ‌డ్జెట్ పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే `వాల్టేర్ వీరయ్య` వర్కింగ్ డేస్ కూడా 150 రోజులు దాటాయి. ప్రస్తుతం గ్రీస్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. దీని వల్ల ప్రొడక్షన్ హౌస్ కి భారీ ఖర్చు అవుతుంది.

ఇక ద‌ళ‌ప‌తి విజయ్ ఆ ఇద్ద‌రు హీరోల‌కు త‌క్కువేమీ కాదు. త‌మిళంలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న విజ‌య్ ఇరుగు పొరుగు మార్కెట్ల‌ను కొల్ల‌గొట్టే వ్యూహంతో కొన‌సాగుతున్నాడు. అత‌డు సాధారణంగా ఒక సినిమాకు 80 రోజులు కేటాయిస్తారు. అయితే ఇప్పటికే వంశీ పైడిపల్లి చిత్రానికి 120 రోజులు అయ్యింద‌ని తెలిసింది. తాజా స‌మాచారం మేర‌కు.. ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇది డిసెంబర్ 10 నాటికి పూర్తి కానుంది. లావిష్ గా సినిమాలు తీయడంలో పేరు తెచ్చుకున్న వంశీ పైడిప‌ల్లి బ‌డ్జెట్ ప‌రంగా అనుకున్నదానికంటే హద్దులు దాటిపోయాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చిత్ర‌నిర్మాత‌ దిల్ రాజు మొదట అంచనా వేసిన దాని కంటే 20 శాతం బడ్జెట్ అద‌నంగా పెంచవలసి వచ్చిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అందుకు త‌గ్గ‌ట్టే వారిసుకి త‌మిళంలో బ‌జ్ ఉంది. తెలుగులోను ఈ సినిమాని ఎన్ క్యాష్ చేసుకోవ‌డంలో రాజుగారి ఎత్తుగ‌డ‌లు ఇత‌రుల కంటే మెరుగ్గా వర్క‌వుట‌వుతున్నాయ‌ని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఈ మూడు సినిమాలూ బడ్జెట్ లు అదుపు త‌ప్పాయ‌న్న టాక్ స్ప‌ష్టంగా ఉంది. అయితే సంక్రాంతి సీజన్ వారి డబ్బును తిరిగి రాబ‌డుతుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే మూడు సినిమాలు నాన్ థియేట్రికల్ డీల్స్  రూపంలో మంచి మొత్తాలను రాబట్టాయి. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని థియేట్రికల్ డీల్స్ (తెలుగు) అతి త్వరలో ఖరారు కానున్నాయి. య‌థావిధిగా సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ వ‌ర్సెస్ న‌ట‌సింహా వార్ ర‌క్తి కట్టిస్తుంద‌ని అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. వాల్తేరు వీరయ్య- వీరసింహారెడ్డి-వార‌సుడు విడుదల తేదీలపై మ‌రింత స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News