షారుఖ్ పై ప్రేమ‌తో నాన్న ఇచ్చిన బ‌హుమ‌తులు!

Update: 2016-12-27 13:35 GMT
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ విశ్వ‌విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌దానం చేసింది. యూనివ‌ర్శిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి షారుఖ్ హాజ‌రై, ప్రత్యేక కోటు ధ‌రించుకుని గౌర‌వ డిగ్రీని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా షారుఖ్ మాట్లాడుతూ.. భావోద్వేగాలకు గుర‌య్యారు. ఈ పుర‌స్కారం అందుకోవ‌డం త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌న్నాడు. హైద‌రాబాద్ లో అవార్డు అందుకోవ‌డం త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకమ‌ని చెప్పాడు. ఎందుకంటే, త‌న త‌ల్లి పుట్టినిల్లు అయిన హైద‌రాబాద్ లోనే ఈ పుర‌స్కారం అందుకోవ‌డం అదృష్ట‌మ‌న్నాడు. విద్యార్థుల‌ను ఉద్దేశించి షారుఖ్ మాట్లాడిన మాట‌లు చాలా ప్ర‌త్యేకం అని చెప్పాలి. త‌న తండ్రి ఇచ్చిన మూడు బ‌హుమానాలు త‌న‌కు చాలా పాఠాలు నేర్పించాయ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నాడు.

ప్ర‌తీ పుట్టిన రోజుకీ త‌న తండ్రి ఏదో ఒక పాత వ‌స్తువుని బ‌హుమానంగా ఇచ్చేవార‌నీ, పేద‌రికం కార‌ణంతో కొత్త‌ది కొన‌లేక‌పోయినా.. ఇచ్చిన వాటి గురించి ఎంతో గొప్ప‌గా ఉర్దూలో చెప్పేవారని షారుఖ్ అన్నారు. అలా తండ్రి ఇచ్చిన వాటిలో మూడు బ‌హుమతులు ప్ర‌త్యేకమైన‌వి అని చెప్పాడు. మొద‌టి బ‌హుమ‌తి... విరిగిపోయిన చెస్ బోర్డ్ ఇచ్చార‌ట‌. జీవితంలో అందరితోనూ క‌ల‌సిమెల‌సి ప్ర‌యాణించ‌డం, కొన్ని సంద‌ర్భాల్లో భావోద్వేగాల‌ను నియంత్రించుకుని ఒక అడుగు వెన‌క్కి రావ‌డం, చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా తోటివారంద‌రితోనూ ఒకేలా మెల‌గ‌డం అనేవి చెస్ బోర్డు ద్వారా తండ్రి నేర్పించాడ‌ర‌న్నారు.

రెండో బ‌హుమతిగా టైప్ రైట‌ర్ ని త‌న తండ్రి ఇచ్చాడ‌నీ, ఒక‌సారి రాసింది మ‌ళ్లీ చెరుపుకునే అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి ప్ర‌తీ క్ష‌ణం ఎంతో ఏకాగ్ర‌త‌తో ఉండాల‌ని ఆ బ‌హుమ‌తి ద్వారా నేర్పించార‌ని షారుఖ్ చెప్పాడు. మూడో బ‌హుమ‌తి పాత కెమెరా... ఆ కెమెరా ప‌నిచేసేది కాద‌ట‌. దృశ్యాల‌ను అందులోంచి చూడ్డ‌మేగానీ, వాటిని ఫొటోల్లో బంధించే అవ‌కాశం ఉండేది కాద‌ట‌. దాని ద్వారా కూడా త‌న‌కు కొన్ని పాఠాలు నేర్పించార‌నీ, జీవితం కోరుకున్న‌వ‌న్నీ ద‌క్క‌వ‌నీ, ఆశ‌లూ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా కొన్నిసార్లు జీవితం ఉండ‌ద‌నే విష‌యాన్ని ఆ కెమెరా ద్వారా అర్థ‌మ‌య్యేలా చెప్పార‌నీ షారుఖ్ వివ‌రించాడు. ఇలా త‌న జీవితంలో ఆ మూడు బ‌హుమతులూ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌విగా నిలిచాయని భావోద్వేగాల‌కు లోనౌతూ షారుఖ్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News