షారుఖ్ ఖాన్ కు ఐటి షాక్

Update: 2018-01-31 04:32 GMT
బాలీవుడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు పెద్ద షాకే ఇచ్చింది. తాను ఎంతో ముచ్చటపడి కష్టపడి కట్టుకున్న ఆలిభాగ్ ఫార్మ్ హౌస్ ను సీజ్ చేసేసింది. ఇది చట్టవిరుద్ధ నిర్మాణం కిందకు వస్తుందని నిషేధిత బినామి ఆస్తుల లవాదేవేల చట్టం(PBPT)ప్రకారం పోయిన డిసెంబర్ లోనే ఐటి శాఖ నోటీసులు ఇచ్చింది. దీనికి బాధ్యతగా బదులు ఇవ్వాల్సిన షారుఖ్ స్పందించలేదు. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఐటి శాఖ ముందుగా ఆ ఫార్మ్ హౌస్ ని సీజ్ చేసి పారేసింది. సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షారుఖ్ ఖాన్ ఎంతో ముచ్చటపడి దీన్ని కట్టుకున్నాడు. పుస్తక విలువే 15 కోట్ల దాకా ఉండగా మార్కెట్ వేల్యూ మాత్రం అంతకు ఐదింతలు ఉంటుందని వార్త. అంటే 75 కోట్ల పైమాటే. విస్తారంగా ఉండే స్విమ్మింగ్ పూల్, పెద్ద హెలీ ప్యాడ్ ఇందులో ఉన్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ కోల్ కొతా నైట్ రైడర్స్ సిఈఒగా షారుఖ్ ఈ మెయిల్ కు ఈ నోటీసులు పంపించారు.

ఇక్కడ ఐటి శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం దీన్ని షారుఖ్ ఖాన్ వ్యవసాయ భూమిగా చూపించి కొనుగోలు చేసాక తన వ్యక్తిగత అవసరాలకు, విలాసాలకు, పార్టీలకు వాడుతున్నాడని. నిజంగానే షారుఖ్ ఖాన్ తన పుట్టిన రోజులతో సహా అని వేడుకలను బాలీవుడ్ మిత్రులతో కలిసి ఇందులోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు. PBPT యాక్ట్ సెక్షన్ 2(9)ప్రకారం షారుఖ్ చట్టాన్ని అతిక్రమించాడు అని ఐటి శాఖ ఫిర్యాదులో నమోదు చేసింది. పైగా ఇది బినామి ఆస్తుల చట్టం కిందకు రావడంతో షారుఖ్ కాస్త గట్టిగానే పోరాడాలి. ఈ నోటీసులు అందుకున్న 45 రోజుల్లో షారుఖ్ ఖాన్ బదులు చెప్పాల్సి ఉంటుంది. హై కోర్ట్ కు వెళ్ళడానికి 60 రోజుల సమయం కూడా ఉంటుంది. కింగ్ ఖాన్ లాంటి బిగ్ షాట్ కి ఈ మాత్రం గడువు సరిపోతుంది లేండి. ఈ ఫార్మ్ హౌస్ ను తన పేరు మీద కాకుండా నకిలీ సంస్థ డేజా వూ పేరుతో కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ మీడియా కథనం .

మొత్తానికి వివాదాలకు దూరంగా ఉండే షారుఖ్ ఖాన్ మెడకు ఇప్పుడు పెద్దదే చుట్టుకుంది. అందరికి పరిచయమున్న ఆలిభాగ్ హౌస్ కావడంతో ఈ వార్త ఇంకా ప్రాచుర్యాన్ని పొందుతోంది. బాలీవుడ్ లోనే అత్యంత సంపన్నుడైన హీరో చేయాల్సిన పని కాదని కొందరు అంటుండగా ఫాన్స్ మాత్రం కోర్ట్ లో నిజానిజాలు బయటపడ్డాకే కామెంట్ చేయమని కోరుతున్నారు.ఈ నోటీసుల్లో బాధ్యులుగా షారుఖ్ ఖాన్ తో పాటు డేజా వూ డైరెక్టర్స్ రమేష్ చిబ్బా, సవితా చిబ్బాలతో షారుఖ్ అత్తా మామలు - మేనకోడలు పేర్లు కూడా ఉన్నాయట. పేర్లు వాళ్ళవే అయినా పెత్తనం షారుఖ్ దే కాబట్టి సమాధానం చెప్పాలి. కింగ్ ఖాన్ ఇంకా దీని గురించి నేరుగా స్పందించలేదు.

 
Tags:    

Similar News