అప్పుడు నిత్యా.. ఇప్పుడు శ్రుతి

Update: 2015-07-09 09:49 GMT
ఒకే బంగారం చిత్రంతో సక్సెస్‌ అందుకున్నారు మణిరత్నం. చాలా కాలానికి దక్కిన అపురూప విజయమిది. వరుస వైఫల్యాలతో విమర్శల ఝడిలో తడిసి ముద్దయిన మణి సర్‌కి ఊరటనిచ్చిన చిత్రంగా 'ఓకే బంగారం' పేరు చెప్పుకోవాలి.

ఈ చిత్రంలో నటించిన నిత్యామీనన్‌, దుల్కార్‌ సల్మాన్‌ జంటకి మంచి పేరొచ్చింది. ముఖ్యంగా నిత్యా నటన అసమానం అంటూ ప్రశంసలొచ్చాయి. అయితే ఆ తర్వాత మణి సర్‌ వేరొక ప్రాజెక్టు గురించి ముచ్చటించిందే లేదు. ఇటీవలి కాలంలో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని హింట్స్‌ ఇస్తున్నారాయన.

ఇప్పటికే కార్తీతో మంతనాలు సాగిస్తున్నారు. కార్తీ సైతం మణిరత్నం సినిమాలో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

లేటెస్టుగా స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌తోనూ మణిరత్నం చర్చలు సాగిస్తున్నారన్న అప్‌డేట్‌ వచ్చింది. శ్రుతి ఎప్పట్నుంచో ఆసక్తిగానే ఉన్నా మణి సర్‌తో పనిచేయడం కుదరలేదు. గతంలో ఓ ఛాన్స్‌ అలాగే మిస్సయ్యింది. కాల్షీట్ల సమస్య వల్ల తను ఎంతో ఇష్టపడే మణితో పనిచేయలేకపోయింది. అయితే ఈసారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడుతోంది. కార్తీ సరసన మణిరత్నం సినిమాలో అవకాశం ఒడిసిపట్టుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని రెడీ అవుతుందని చెబుతున్నారు.

అంతేనా ఈ చిత్రంలో ఒకే బంగారం ఫేం దుల్కార్‌ సల్మాన్‌ ఓ కీలకపాత్ర పోషిస్తాడని చెన్నయ్‌ వర్గాలు చెబుతున్నాయి. కథానాయికల్ని ఆవిష్కరించడంలో మణి సర్‌ మహామేధావి. శ్రుతి ఇంతకాలం చేసిన ప్రాజెక్టులన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రం ఓ ఎత్తు అవుతుంది.



Tags:    

Similar News