వివాదంలో సింగ‌ర్‌ శ్ర‌వ‌ణ భార్గ‌వి!

Update: 2022-07-19 12:29 GMT
ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ శ్ర‌వ‌ణ భార్గ‌వి ఇటీవ‌ల భ‌ర్త‌, సింగ‌ర్‌, సంగీత ద‌ర్శ‌కుడు హేమ చంద్ర‌తో విడిపోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. ఈ వార్త‌లు కాస్తా వైర‌ల్ కావ‌డంతో హేమ‌చంద్ర‌, శ్ర‌వ‌ణ భార్గ‌వి విడాకుల వార్త‌ల పై క్లారిటీ ఇచ్చారు. ఇవ‌న్నీ గాలి వార్త‌లే అని కొట్టి పారేశారు.
అయితే తాజాగా శ్ర‌వ‌ణ భార్గ‌వి మ‌రో సారి వార్త‌ల్లో నిలిచింది. అన్న‌మ‌య్య రాసిన ఓ పాట‌ని పాడ‌ట‌మే కాకుండా త‌న‌పై ఓ వీడియోని చేసింది.

దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. `ఒక‌ప‌రికొక‌ప‌రి వ‌య్యార‌మై` అంటూ సాగే అన్నమ‌య్య కీర్తన‌ని ఆల‌పించింది. పాడ‌ట‌మే కాకుండా ఇందులో న‌టించింది. అదే ఇప్ప‌డు వివాదానికి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. చీర‌క‌ట్టుకుని ఇంటిలో ఓ సాధార‌ణ మ‌హిళా చేసే ప‌నులు చేస్తూ క‌నిపించింది. ప‌డుకుని పుస్త‌కాలు చ‌ద‌వ‌డం.. గార్డెన్ లో షికారు, పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డం వంటివి చేసింది. రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోని 6. 5 ల‌క్ష‌ల మంది వీక్షించారు.  

అయితే ఈ పాట‌ని త‌న‌కు అన్వ‌యించుకుని పాడ‌ట‌మే కాకుండా కాళ్లే క‌నిపించేలా ప‌డుకుని పాడ‌టం, అందులో సంప్ర‌దాయ బ‌ద్ధంగా పెళ్లైన యువ‌తి కాళ్ల‌కు వుండాల్సిన మ‌ట్టెలు లేక‌పోవ‌డంతో శ్ర‌వ‌ణ భార్గ‌విపై అన్న‌మ‌య్య వంశీయులు, ట్ర‌స్ట్ వారు మండిప‌డుతున్నారు.

అన్న‌మ‌య్య కీర్త‌న‌ను నృత్య రీతిగా చిత్రీక‌రిస్తే మాకు ఎలాంటి అభ్యంత‌రం వుండేది కాద‌ని, అన్న‌మ‌య్య పెద్ద కుమారులు పెద్ద తిరుమాచార్యులు సాక్ష్యాత్తు స్వామివారికి అభిషేక కైంక‌ర్యాలు చేస్తూ కీర్తించిన పాట‌కు కాళ్లు ఊపుతూ ప‌డుకుని అభిన‌యించ‌డం త‌ప్పు అని అన్న‌మ‌య్య ట్రస్ట్ స‌భ్యులు వాదిస్తున్నారు.

ఇక ఈ వీడియోని యూట్యూబ్ నుంచి తొల‌గించ‌మ‌ని శ్ర‌వ‌ణ భార్గ‌విని సంప్ర‌దించామ‌ని, కానీ ఆమె వెకిలి న‌వ్వుల‌తో స‌మాధానం ఇచ్చింద‌ని ట్ర‌స్ట్ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వివాదంపై శ్ర‌వ‌ణ భార్గ‌వి కూడా ఘాటుగానే స్పందించింది. నేనొక బ్రాహ్మ‌ణ యువ‌తిని. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు తెలుసు. సంగీతం మీద‌వున్న ఇష్టంతో మేం ఎంతో క‌ష్ట‌ప‌డి వీడియోలు చేస్తాం. నేను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆ పాట‌ను చిత్రీక‌రించాను. ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన వీడియోను తొల‌గించే ప్ర‌స‌క్తే లేదు.

దైవాజ్ఞ‌తో ఆ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని నా న‌మ్మ‌కం` అంటూ ఘాటుగా స్పందించింది. అంతే కాకుండా యూట్యూబ్ లో ఈ వీడియోని తొల‌గిస్తే ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా గ్రామ్ లో అప్ లోడ్ చేస్తాన‌ని అక్క‌డ వైర‌ల్ అవుతుంద‌ని స‌మాధానం చెప్ప‌డం వివాదానికి మ‌రింత‌గా ఆజ్యం పోసింద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News