'ప్రియ'మైన నాగికి సుక్కు రాయునది ఏమనగా

Update: 2018-05-10 11:09 GMT
ట్యాలెంటెడ్ డైరెక్టర్.. అని ఎవరినైనా ఊరికినే అంటారా ఏంటి చెప్పండి. అలా అనిపించుకోవాలంటే.. వారు ముందు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. తమ ప్రతిభా పాటవాలను చూపించాల్సి ఉంటుంది. ఇంతగా ఉపోద్ఘాతం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే.. మహానటి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నాగ్ అశ్విన్ ను ప్రశంసిస్తూ సుకుమార్ రాసిన ఓ లేఖ ఇందుకు కారణంగా నిలిస్తోంది.

'ప్రియ'మైన అశ్విన్ అంటూ ఆరంభంలోనే తన చతురత చూపించాడు సుక్కు. దర్శకుడి భార్య పేరు ప్రియాంక అని తెలుసు కదా. ఇంతకీ ఈ లెటర్ లో ఏముందంటే.. మహానటి మూవీ చూసి.. నాగ్ అశ్విన్ తో మాట్లాడేందుకు ఫోన్ ట్రై చేస్తూ నుంచున్నాడట సుక్కు. ఇంతలో ఓ పెద్దావిడ వచ్చి.. నువ్వు డైరెక్టరా బాబూ అని అడిగి.. మా సావిత్రమ్మను ఎంత బాగా చూపించావో అంటూ గట్టిగా సుకుమార్ ను పట్టుకుని కన్నీళ్లు పెట్టేసుకుందట. ఈ ప్రేమ చూసి.. తను ఆ చిత్రానికి దర్శకుడిని కాదు అని చెప్పలేకపోయాడట సుక్కు. కాసేపు నాగ్ అశ్విన్ గా మారిపోయానని.. కొన్ని క్షణాలపాటు నేనే నీవైపోయానని లేఖలో రాశాడు సుకుమార్.

చివరలో ఓ గమనిక కూడా రాశాడండోయ్. ఎప్పటికీ ఆ పెద్దావిడకు ఈ సినిమా దర్శకుడు తను కాదని తెలియకుండా ఉండాలని కోరుకుంటున్నాడట. ఈ లేఖ వరకూ వాస్తవమే కానీ.. అందులోకి వచ్చిన పెద్దావిడ పాత్ర కల్పితమే కావచ్చు. కానీ 'ప్రియ'మైన అశ్విన్ ను అభినందించేందుకు సుకుమార్ ఎంచుకున్న విధానం ఇది. తను చెప్పదలచుకున్న విషయాలను హత్తుకునేలా చెప్పేందుకు ఇలాంటి పాత్రలను సృష్టించేయడం సుక్కుకు సినిమాల వరకూ అలవాటే. కానీ రియల్ లైఫ్ లో మరో దర్శకుడిని అభినందించేందుకు ఇలా క్రియేటివిటీ చూపించడం మాత్రం సూపర్ అనాల్సిందే.



Tags:    

Similar News