ఈ సారైనా `సింగం` గ‌ర్జిస్తుందా?

Update: 2017-11-26 10:33 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల‌ను త‌మిళ ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆద‌రించిన దాఖ‌లాలు లేవు. ఒక‌రిద్ద‌రి సినిమాలు మాత్ర‌మే త‌మిళ‌నాడులో ఓ మోస్త‌రుగా ఆడాయి. అందుకే, తెలుగు నుంచి త‌మిళంలోకి డ‌బ్ అయ్యే సినిమాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే, త‌మిళ స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా తెలుగులో రిలీజ్ అవ‌డ‌మే కాకుండా భారీ హిట్ లు కూడా అయిన సంద‌ర్భాలున్నాయి. ర‌జ‌నీ నుంచి విశాల్ వ‌ర‌కు అంద‌రి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ర‌జ‌నీ, - క‌మ‌ల్‌ - అజిత్ - విక్ర‌మ్‌ - విజ‌య్ - సూర్య వంటి హీరోలకు ఇక్క‌డ తెలుగు హీరోల‌తో స‌మానంగా క్రేజ్ ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ర‌జ‌నీ - క‌మ‌ల్ త‌ర్వాత సూర్య‌కు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. సూర్య న‌టించిన కొన్ని సినిమాలు దాదాపు 20 కోట్లు క‌లెక్ట్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే, కొంత‌కాలంగా సూర్య‌కు తెలుగు మార్కెట్ లో ఆశించినంత ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు.

సాధార‌ణంగా సూర్య త‌న సినిమాల‌కు రెమ్యున్ రేష‌న్ బ‌దులు...తెలుగు కాపీ రైట్స్ కు వ‌చ్చే డ‌బ్బుని తీసుకుంటాడు. అయితే, సింగం సిరీస్ లో వ‌చ్చిన సింగం-3 సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆద‌రించలేదు. దీంతో, సూర్య మార్కెట్ తగ్గిపోయింది. సింగం త‌ర‌హాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సూర్య‌ను ప‌ల‌క‌రించి చాలా కాలం అవ‌డం కూడా మార్కెట్ డౌన్ అవ‌డానికి మ‌రో కార‌ణం. దీంతో, సూర్య త‌ర్వాతి చిత్రం `సెరింద కూటమ్` కాపీ రైట్స్ రేటు సగానికి సగం ప‌డిపోయింద‌ట‌. ఈ చిత్ర తెలుగు కాపీరైట్స్ ను గీతా ఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌ సంస్థలు సొంతం చేసుకున్నాయి. తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌కి 10 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కక‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణం కావ‌చ్చ‌ని ట్రేడ్ విశ్లేష‌కుల అంచ‌నా. ఈ సినిమాతో సూర్య హిట్టు కొట్టకపోతే సూర్య బ్రాండ్ మ‌రింత త‌గ్గే ప్ర‌మాదం ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News