ఇక సముద్రంలో వేట మొదలెడుతున్న సూర్య!

Update: 2022-05-03 04:40 GMT
మొదటి నుంచి కూడా సూర్య విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తెరపై తాను కొత్తగా కనిపించడానికీ .. తన పాత్ర ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడానికి ఆయన ఎంత కష్టమైనా పడతాడు. వైవిధ్యభరితమైన కథలను చేయడానికి సూర్య తపించిపోతాడనడానికి నిదర్శనంగా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' .. '24' .. '  సెవెంత్ సెన్స్' వంటి సినిమాలు కనిపిస్తాయి. ఒక వైపున కల్పిత కథలతో పాటు మరో వైపున యథార్థ సంఘటనలకు  కూడా కథా రూపాన్నిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడు.

 ఈ నేపథ్యంలో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' వంటి సినిమాలు ఆయనకి ప్రశంసలను తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తమిళనాట విలక్షణ దర్శకుడిగా బాలాకి పేరు ఉంది.

ఆయన ఎంచుకునే కథలు .. వాటిని ఆయన తెరపై ఆవిష్కరించే పద్ధతి డిఫరెంట్ గా ఉంటాయి. గతంలో ఆయన సూర్యతో చేసిన సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అందువల్లనే ఆయన అడిగిన వెంటనే సూర్య డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

సూర్య - బాలా కాంబినేషన్లో  రూపొందుతున్న ఈ సినిమా సముద్రం నేపథ్యంలో నడుస్తుందట. ముఖ్యంగా సెకండ్ పార్టు అంతా కూడా సముద్రంపైనే ఉంటుందని అంటున్నారు. ఆ కథ ఏమై ఉంటుంది? సూర్యను బాలా ఎలా చూపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి ఇద్దరూ కలిసి ఒక ప్రయోగమైతే చేయనున్నట్టుగా  తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు. ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను .. మరో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతోనే కృతి శెట్టి కోలీవుడ్ లో అడుగుపెడుతోంది.

ఇక సూర్య  వెట్రిమారన్ వినిపించిన ఒక కథకు కూడా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కలిసి పని చేశారు కూడా. ఈ సినిమాను కూడా సాధ్యమైనంత  త్వరగా పట్టాలెక్కించే పనిలోనే సూర్య ఉన్నాడు.

ఆ తరువాత ఆయనతో మరో సినిమా చేయడానికి సుధా కొంగర సిద్ధంగానే ఉన్నారు. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఆమె, ఈ సారి సూర్య కోసం ఒక డిఫరెంట్ లైన్ ను రెడీ చేసినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి ఎప్పటిలానే సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడన్న మాట.
Tags:    

Similar News