'స్వాతిముత్యం' మూవీ రివ్యూ

Update: 2022-10-05 12:40 GMT
'స్వాతిముత్యం' మూవీ రివ్యూ
నటీనటులు: బెల్లంకొండ గణేష్-వర్ష బొల్లమ్మ-రావు రమేష్-గోపరాజు రమణ-వెన్నెల కిషోర్-శివన్నారాయణ-నరేష్-సుబ్బరాజు-సురేఖావాణి-దివ్య శ్రీపాద తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: సూర్య
మాటలు: రాఘవ్ రెడ్డి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ

ఓవైపు 'భీమ్లా నాయక్' లాంటి పెద్ద సినిమాలు నిర్మిస్తూ.. మరోవైపు 'డీజే టిల్లు' లాంటి చిన్న చిత్రాలతోనూ సత్తా చాటుతున్న నిర్మాణ సంస్థ.. సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ బేనర్లో తెరకెక్కిన మరో చిన్న సినిమా.. స్వాతిముత్యం. బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దసరాకు రెండు పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ధీమాగా వాటితో పోటీకి సై అంది. మరి ఈ సినిమాలో అంత ప్రత్యేకంగా ఏముందో చూద్దాం పదండి.

కథ:

బాలకృష్ణ మురళి (బెల్లంకొండ గణేష్) చదువు పూర్తి చేసుకుని జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్న కుర్రాడు. పెళ్లీడుకొచ్చిన అతడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు కానీ.. ఏవీ ఒక పట్టాన సెట్ కావు. అలాంటి సమయంలోనే భాగ్యలక్ష్మి అనే అమ్మాయిని ప్రైవేటు పెళ్ళిచూపుల్లో కలుస్తాడు బాల. ఆమెను చూడగానే అతను ఇష్టపడతాడు. భాగ్యలక్ష్మి తన అభిప్రాయం చెప్పడానికి కొంచెం సమయం అడుగుతుంది కానీ.. తర్వాత బాల మీద ఆమెకు ఇష్టం కలిగి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ పెళ్లి రోజు బాలకు పెద్ద సమస్య వచ్చి పడుతుంది. బాల తెలియక చేసిన తప్పు వల్ల అతడి పెళ్లే ఆగిపోతుంది. ఇంతకీ అతను చేసిన తప్పు.. ఎదురైన సమస్య ఏంటి? దీన్ని పరిష్కరించుకుని భాగ్యలక్ష్మిని బాల తనదాన్ని చేసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హీరో అంటే వీరాధివీరుడయ్యే ఉండాలనేమీ లేదు. అతను డ్యాన్సులు ఇరగదీయకపోయినా పర్వాలేదు. వీర లెవెల్లో ఫైట్లు చేయాల్సిన పని లేదు. హీరోయిన్ అంటే అందాల రాశి అయ్యుండాలనేమీ లేదు. హీరోతో కలిసి ఆమె డ్యూయెట్లు వేసుకుని స్టెప్పులూ వేయాల్సిన అవసరం లేదు. హీరో హీరోయిన్ ఇద్దరూ మనలాంటి వాళ్లే అయ్యుండొచ్చు. తెరపై కనిపించే వాళ్లంతా మన చుట్టూ ఉన్న మనుషుల్లాగే ఉండొచ్చు. వాళ్లందరికీ మన లాంటి ఆలోచనలే ఉండొచ్చు. రోజూ మనం చూసే.. ఎదుర్కొనే సమస్యల్నే తెర మీద చూపించొచ్చు. కాకపోతే మనం రిలేట్ చేసుకునే విషయాలనే తెరపై కొంచెం అందంగా.. ఆసక్తికరంగా చూపిస్తే చాలు.. ఆ కథలు పాసైపోతాయి. ఒకప్పుడు చిన్న సినిమాలైనా సరే.. ఎక్కడ్నుంచో ఊడిపడ్డ పాత్రలు.. మనం రిలేట్ చేసుకోలేని కథలతో విసిగించేవి. కానీ గత కొన్నేళ్లలో వచ్చిన మంచి మార్పు వల్ల చాలా సింపుల్ గా అనిపిస్తూనే మనల్ని లీనం చేసే అందమైన కథలతో కొన్ని చిన్న సినిమాలు మనసు దోస్తున్నాయి. మిడిల్ క్లాస్ మెలోడీస్.. అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి ఈ తరహా చిత్రాల వరుసలో వచ్చిన మరో మంచి ప్రయత్నం.. స్వాతిముత్యం.

పైన చెప్పుకున్న రెండు సినిమాల్లో లాగే ఇందులోనూ మన చుట్టూ ఉండే మనుషులే తెరపై కనిపిస్తారు. మనకు రోజూ ఎదురయ్యే అనుభవాలే చాలా వరకు తెరపై కనిపిస్తాయి. పాత్రధారులు ఎవ్వరూ నటిస్తున్నట్లు బిహేవ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. తొలి సన్నివేశం నుంచి ఎక్కడా హడావుడి లేకుండా.. చాలా సహజంగా.. అందంగా సాగిపోయే సన్నివేశాలతో కాసేపటికే మనల్ని ఈ కథతో ట్రావెల్ అయ్యేలా చేస్తుంది స్వాతిముత్యం. కథ పరంగా ఒక దశ వరకు చాలా మామూలుగా అనిపిస్తున్నప్పటికీ.. ఈజీగా రిలేట్ చేసుకునే పాత్రలు.. ఆహ్లాదం పంచే సింపుల్ సన్నివేశాలతో ఎంగేజ్ చేస్తుంది స్వాతిముత్యం. ఇక విరామ సమయానికి వీర్య దానం అనే భిన్నమైన పాయింట్ తో కథను మలుపు తిప్పాడు కొత్త దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ. ఆ పాయింట్ మరీ కొత్తదేమీ కాదు. బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్ లో ఆల్రెడీ చూసిందే. కాకపోతే అందులో హీరో ఒక ప్రొఫెషనల్ స్పెర్మ్ డోనర్ లాగా కనిపిస్తే.. ఇందులో హీరో అనుకోకుండా ఒకసారి వీర్యదానం చేసి.. ఇబ్బందుల్లో పడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మరాఠీ మూవీ ఆధారంగా హిందీలోనే వచ్చిన మిమి స్ఫూర్తి కూడా కొంతమేర స్వాతిముత్యంలో కనిపిస్తుంది. డబ్బులిచ్చి సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకున్న వాళ్లు.. డెలివరీ టైంకి రాక ఆ బిడ్డ ఇక్కడే ఉండిపోతే.. ఆ బిడ్డ హీరో మెడకు చుట్టుకోవడం చుట్టూ ఈ కథ నడుస్తుంది.

ఈ పాయింట్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కావడం వల్ల.. దాని మీద కథను మలుపు తిప్పిన దగ్గర్నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదవులతుంది. వీర్యదానం.. సరోగసీ లాంటి మాటలు వింటే మామూలుగా జనాలు ఏదోలా ఫీలవుతారు కానీ.. సినిమాలో ఏమాత్రం ఎబ్బెట్టుగా ఫీల్ కాని విధంగా వీటి చుట్టూ క్లీన్ కామెడీని పండిస్తూ కథను ముందుకు నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ సాఫీగానే సాగిపోయినా.. పెద్దగా కామెడీ అయితే లేదు. కానీ ద్వితీయార్ధంలో ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూ సాగుతుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో కనిపించే బడాయి మనుషుల వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా గోపరాజు రమణతో చేయించిన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఆయనకు పోటీగా రావు రమేష్ కూడా గోదావరి యాస, అక్కడి మనుషుల వ్యక్తిత్వాన్ని దించేస్తూ తన క్యారెక్టర్ని పండించిన విధానం ఆకట్టుకుంటుంది. వీరికి వెన్నెల కిషోర్.. సుబ్బరాజు.. నరేష్.. శివన్నారాయణ లాంటి వాళ్లు కూడా సాయం పట్టడంతో ద్వితీయార్ధంలో సీన్లు భలేగా పేలాయి. ఇక హీరో పాత్రతో ఎమోషన్ కూడా బాగానే పండించారు. పతాక సన్నివేశాల్లో కూడా ఎమోషన్.. హ్యూమర్ బాగా వర్కవుట్ కావడంతో స్వాతిముత్యం మంచి అనుభూతితో ప్రేక్షకులను థియేటర్ల నుంచి బయటికి పంపిస్తుంది. కథ కొత్తగా అనిపిస్తూనే.. యూత్ తో పాటు ఫ్యామిలీస్ కూడా ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఉండడం స్వాతిముత్యంకి పెద్ద ప్లస్. సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా నడవడం.. పాటలు ఆశించిన స్థాయిలో లేకపోవడం.. హీరో నామమాత్రంగా అనిపించడం లాంటి చిన్న ప్రతికూలతను పక్కన పెడితే స్వాతిముత్యంతో పెద్దగా ఇబ్బందులేమీ లేవు.

నటీనటులు:

కొత్త కుర్రాడు బెల్లంకొండ గణేష్ ఇలాంటి కథతో హీరోగా పరిచయం కావడానికి ఒప్పుకున్నందుకు ముందు అతణ్ని అభినందించాలి. అందులోనూ తన అన్న శ్రీనివాస్ మొదట్నుంచి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి ఎంత ప్రయత్నించాడన్నది దృష్టిలో ఉంచుకుని చూస్తే.. తొలి సినిమాలో అతను ఇలాంటి పాత్ర.. కథకు ఓకే చెప్పడం ఆశ్చర్యమే. లుక్స్.. యాక్టింగ్ పరంగా గణేష్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. అమాయకుడిగా కనిపించాలని అతను చాలా చోట్ల అసలు మరీ సాధారణమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కూడా సరిగా రియాక్ట్ కాకుండా ఉండిపోవడంలో ఔచిత్యం కనిపించదు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ బయట చూస్తే చాలా మామూలుగా అనిపిస్తుంది కానీ.. తనకు కంటెంట్ ఉన్న పాత్రలు ఇస్తే దానికి బాగా న్యాయం చేస్తుందని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత ఆమె మరోసారి మెప్పించింది. గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లో ఆమె ఈజీగా ఒదిగిపోయింది. ఇక ఆర్టిస్టులందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించేది రావు రమేష్.. గోపరాజు రమణలే. రావు రమేష్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఆయన తప్ప ఎవరూ ఇలా చేయలేరు అనేలా హీరో తండ్రి పాత్రను పండించారు. గోపరాజు రమణ పాత్ర చాన్నాళ్లు గుర్తుండిపోతుంది. ఆయన క్యారెక్టరైజేషన్ సూపర్ అనే చెప్పాలి. నటన కూడా అందుకు తగ్గట్లే సాగింది. వెన్నెల కిషోర్.. నరేష్.. సుబ్బరాజు.. శివన్నారాయణ.. సురేఖ వాణి.. హర్షవర్ధన్.. ప్రగతి.. వీళ్లంతా ఎవరి పాత్రలను వాళ్లు సమర్థంగా పోషించారు.

సాంకేతిక వర్గం:

స్వాతిముత్యం సినిమాలో సంగీతం ఇంకొంచెం బలంగా ఉండుంటే సినిమా స్థాయి పెరిగేది. మహతి స్వర సాగర్ పాటల్ని తీసిపడేయలేం కానీ.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల నుంచి ఇంకా మంచి పాటలు ఆశిస్తాం. చార్ట్ బస్టర్ సాంగ్ అంటూ ఏదీ లేదు. నేపథ్య సంగీతం బాగానే సాగింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల్లో వాడిన థీమ్ మ్యూజిక్ బాగుంది. సూర్య ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రాఘవ్ రెడ్డి మాటలు సందర్భోచితంగా అనిపిస్తాయి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ తొలి చిత్రంతోనే మంచి మార్కులు వేయించుకున్నాడు. రైటింగ్ దగ్గరే అతను బాగా ఇంప్రెస్ చేశాడు. తొలి సినిమా అయినా ఎక్కడా తడబాటు కనిపించలేదు. అటు ఇటు అయితే ఎబ్బెట్టుగా తయారయ్యే పాయింట్ మీద లక్ష్మణ్ అందరినీ మెప్పించేలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో సినిమాను నడిపించిన తీరు ప్రశంసనీయం. లక్ష్మణ్ కు మంచి భవిష్యత్ ఉందని ఈ సినిమా చూసిన ఎవరికైనా అనిపిస్తుంది.

చివరగా: స్వాతిముత్యం.. వీర్యదానంతో వినోదం

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News