ఆ ప్ర‌ముఖ న‌టి నెల ఖ‌ర్చు రూ.20వేలేన‌ట‌!

Update: 2019-07-25 05:00 GMT
పేరున్న న‌టి లైఫ్ స్టైల్ ఎంత రిచ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నెల‌స‌రి ఖ‌ర్చు త‌క్కువ‌లో త‌క్కువ ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఇవాల్టి రోజున టీవీ యాంక‌ర్ల ఖ‌ర్చే ల‌క్ష దాటేస్తున్న ప‌రిస్థితి. అలాంటిది ప్ర‌ముఖ న‌టిగా పేరున్న ఒక న‌టి నెల‌స‌రి మొత్తం ఖ‌ర్చు అక్ష‌రాల రూ.20వేలు మాత్ర‌మేన‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఆమె ఎవ‌రంటారా?  గ్లామ‌ర్ న‌టిగానే కాదు.. న‌చ్చిన పాత్ర కోసం ఎంత సాహ‌సానికైనా వెనుకాడ‌ని అమ‌లాపాల్ ముచ్చ‌ట ఇది.

'ఆమె' చిత్రంతో సంచ‌ల‌నంగా మారిన అమ‌లాపాల్ తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు.ద‌ర్శ‌కుడు విజ‌య్ తో త‌న వివాహ‌బంధం ఫెయిల్ అయ్యాక త‌న మాన‌సిక ప‌రిస్థితి చాలా దారుణంగా ఉండేద‌న్నారు. ప్రేమించి పెళ్లాడిన వ్య‌క్తితో రెండేళ్లకే వైవాహిక జీవితం ముగిసిపోవ‌టాన్ని జీర్ణించుకోవ‌టం చాలా క‌ష్టంగా ఉండేద‌న్నారు.

విడిపోయాక చాలా బాధ ప‌డ్డాన‌ని.. త‌ట్టుకోలేక‌పోయేదానిన‌ని చెప్పారు. ఒంట‌రిగా అనిపించేద‌ని.. ఎక్క‌డికైనా పారిపోవాల‌నుకునేదానన్నారు. 17 ఏళ్ల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌న‌కు ఏమీ తెలీయ‌ద‌ని.. తన‌తో ఎవ‌రూ లేర‌నిపించేద‌ని చెప్పారు. అలాంటి వేళ హిమాల‌యాల‌కు వెళ్లి నాలుగు రోజులు ఉన్నాన‌ని.. అక్క‌డే జీవిత ప‌ర‌మార్థం గురించి తెలుసుకున్న‌ట్లు చెప్పారు. అక్క‌డ ఉన్న‌న్ని రోజులు మొబైల్ లేకుండా గ‌డిపాన‌ని.. టెంట్ లో నిద్ర‌పోయాన‌ని.. ఆ ట్రిప్ తో తన‌లో అసంతృప్తి చెందే ధోర‌ణి త‌గ్గిపోయింద‌న్నారు.

ఇప్పుడు తాను చాలా సాదాసీదాగా బ‌తుకుతున్న‌ట్లు చెప్పారు. త‌న ద‌గ్గ‌రున్న బెంజ్ కారు అమ్మేసి.. సైకిల్ కొన్నట్లు చెప్పారు. ఇంటి అవ‌స‌రాల‌కు సంబంధించి వ‌స్తువులు కొనుక్కోవ‌టానికి సైకిల్ మీద వెళ్లి కొనుక్కుంటున్న‌ట్లు చెప్పారు.

త‌న‌కిప్పుడు హిమాల‌యాల్లో ఉండాల‌ని ఉంద‌ని.. కానీ అది క‌ష్టం కావ‌టంతో తానిప్పుడు పాండిచ్చేరిలో ఉంటున్న‌ట్లు చెప్పారు. త‌న నెల‌స‌రి ఖ‌ర్చు రూ.20వేలు మాత్ర‌మేన‌ని.. బ్యూటీపార్ల‌ర్ కు వెళ్ల‌టం కూడా బంద్ చేసిన‌ట్లు చెప్పారు. సినీ స్టార్ అయిన‌ప్ప‌టికీ ఇంట్లోనే త‌యారు చేసుకున్న ముల్తానా మ‌ట్టి.. పెస‌లుతో చేసిన పేస్ట్ ను ముఖానికి అప్లై చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌ముఖ న‌టీమ‌ణుల్లో ఒక‌రి లైఫ్ స్టైల్ ఇంత సింఫుల్ గా ఉండ‌టాన్ని అస్స‌లు ఊహించ‌లేమేమో!


    
    
    

Tags:    

Similar News