ఆ సమయంలో 'భీమ్లా' సెట్ నుంచి పారిపోయాను: త్రివిక్రమ్

Update: 2022-02-27 08:49 GMT
పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కలిసి పనిచేయడం .. ఇద్దరికీ తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉండటం వాళ్ల సాన్నిహిత్యాన్ని పెంచుతూ వెళ్లింది. ఇక త్రివిక్రమ్ ఆలోచనా విధానం .. ఆయన ఒక సినిమాకి స్క్రిప్ట్ ను తయారు చేసే పద్ధతిని పవన్ చాలా ఇష్టపడతారు.

అందువలన తన ఇతర సినిమాలకి సంబంధించిన కథల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే త్రివిక్రమ్ సలహాలను .. సూచనలను పవన్ తీసుకుంటూ ఉంటారు. అలాగే పవన్ మాటను కాదనలేక ఆయన 'భీమ్లా నాయక్' సినిమాకి స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చారు.

ఈ నెల 25వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నిన్న ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ను జరుపుకుంది. త్రివిక్రమ్ .. సాగర్ చంద్ర .. తమన్ .. సంయుక్త మీనన్ .. రామజోగయ్య శాస్త్రి .. కాసర్ల శ్యామ్ హాజరయ్యారు.

ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ .. "ముందుగా మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. మేము తీసిన సినిమాను మీ భుజాలపై జనం దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఒక మంచి సినిమా తీస్తే ఎలా ఆదరిస్తారనేది ఆడియన్స్ మరోసారి నిరూపించారు. వాళ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మలయాళంలోని 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాను రీమేక్ చేయాలనుకున్నప్పుడు మాకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. అక్కడ ఆ సినిమా కథ కోషి (తెలుగులో రానా పాత్ర) వైపు నుంచి చెప్పబడుతుంది. దానిని 'భీమ్లా నాయక్' వైపుకు ఎలా మార్చాలి .. ఎలా బ్యాలెన్స్ చేయాలనేది సవాలుగా మారింది.

ఈ విషయాన్ని గురించి మా అందరి మధ్య చర్చ జరిగింది. 'భీమ్లా నాయక్' పాత్రతో అడవికి సెల్యూట్ చేయించి అడవికి ఇంకా దగ్గరగా తీసుకుని వెళితే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందని అనిపించింది. సినిమాలో ఫ్రేమ్ లో ఉంటే 'భీమ్లా నాయక్' ఉండాలి .. లేదంటే 'డేనియల్ శేఖర్ ఉండాలి .. ఆపై ఇద్దరూ ఉండాలనే ఆలోచనతో మాతృకలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేశాము.

ఈ ఇద్దరి భార్యల పాత్రల వైపు నుంచి కూడా బ్యాలెన్స్ ఉండేలా .. ప్రతి సీన్ కి కౌంటర్ ఉండేలా చూసుకున్నాము. పవన్ అభిమానులు ఆయన సినిమా నుంచి ఆశించే అంశాలు తగ్గకుండా చూసుకోవాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే కొంచెం కష్టమైంది. ఆర్టిస్టులు అంతా కూడా మేము చెప్పిన దానికంటే బాగా చేశారు.

డాన్స్ మాస్టర్ గణేశ్ చాలా కష్టపడ్డాడు. 600 మంది డాన్సర్స్ తో ఒక సాంగ్ కంపోజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. నేను సెట్లోకి అడుగు పెట్టి అక్కడ వాళ్లందరినీ చూసి 'నా వల్ల కాదు నువ్వే చేసుకో .. ఇంతమందిని చూస్తే ముందు నాకు భయం వేస్తుంది' అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాను.

ఆయన 3 రోజుల్లో ఆ పాటను పూర్తి చేశాడు. తను నిజంగా చాలా ప్లాన్డ్ గా చేశాడు. అందరూ కూడా చాలా ప్రేమతో పనిచేశారు. దర్శకుడు సాగర్ అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి మేమంతా సపోర్ట్ చేశామంతే. ఆయన ఇచ్చిన ఐడియాతోనే మొగిలయ్యతో పాడించడం జరిగింది.

ఆయనకి 'పద్మశ్రీ' వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంలో తమన్ ముఖ్యమైన పాత్రను పోషించాడు. కోవిడ్ సమయంలోను బయటికి వచ్చి పవన్ - రానా కష్టపడ్డారు. అందుకు తగిన ఫలితం దక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది" అని చెప్పకొచ్చారు.
Tags:    

Similar News