బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇప్పుడు పోలీసు కేసు పెట్టాల్సి వచ్చింది. తనకు సంబంధించిన ఐడెంటిటీతో ఎవరో మోసం చేయడానికి ప్రయత్నించారంటూ.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఊర్వశి. చివరగా హేట్ స్టోరీ4 చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ హోటల్ కు వెళ్లింది..
ముంబై.. బాంద్రా ప్రాంతంలో ఉన్న ఓ స్టార్ హోటల్ కు వెళ్లింది ఊర్వశి రౌతేలా. ఆ హోటల్ లో రూమ్ కావాలంటూ రిసెప్షన్ సంప్రదించగా.. అప్పటికే ఆమె పేరుపై రూమ్ రిజస్టర్ అయిందని చెప్పారట హోటల్ స్టాఫ్. అయితే.. తన అసిస్టెంట్స్ ను ఆరా తీయగా.. ఎలాంటి బుకింగ్స్ చేయలేదని వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో మరింతగా రూమ్ బుకింగ్ గురించి ప్రశ్నించగా.. ఆమె ఆధార్ కార్డ్ ద్వారా ఆన్ లైన్ విధానంలో రూమ్ బుకింగ్ చేసినట్లు చెప్పారు హోటల్ నిర్వాహకులు. తీరా పరిశీలిస్తే.. అది నకిలీ ఆధార్ కార్డ్ అని గుర్తించిందట ఊర్వశి రౌతేలా.
ఆధార్ నెంబర్ తనది కాదని.. తన ఫోటో-పేరు ఉపయోగించి నకిలీ కార్డు తయారు చేసి హోటల్ రూమ్ బుక్ చేశారని గుర్తించిన ఊర్వశి రౌతేలా.. ఇదే విషయాన్ని వివరిస్తూ.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.