వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''వకీల్ సాబ్'' సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హిందీ 'పింక్' చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లేట్ అవుతూ వచ్చి ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేదు.. అయినా 'వకీల్ సాబ్' పై బజ్ క్రియేట్ అవడం లేదని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చినా.. ఆ సినిమా నుంచి ఏదైనా కంటెంట్ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావుడి కనిపిస్తుంది.. ఆ కంటెంట్ కి యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి.. అప్పటి వరకు ఉన్న మిగతా స్టార్ హీరోల రికార్డ్స్ అన్నీ చెరిగిపోతుంటాయి. అయితే పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' కంటెంట్ విషయంలో అవేమీ జరగలేదు. ఇటీవల విడుదలైన 'సత్యమేవ జయతే' సాంగ్ వ్యూస్ 5 మిలియన్స్ దగ్గరే ఆగిపోయింది. అదే సమయంలో రిలీజైన మీడియం రేంజ్ సినిమాల పాటలకు మిలియన్ల కొలదీ వ్యూస్ వస్తున్నాయి.
పవన్ ని చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటే 'వకీల్ సాబ్' కంటెంట్ కి అదే రేంజ్ లో రెస్పాన్స్ రావాలి. అందులోను పవన్ కంబ్యాక్ సినిమా కాబట్టి ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఈ సినిమాపై హైప్ అంతగా కనిపించడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా పవన్ రాజకీయాల్లోకి వెళ్లాక హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తగ్గిపోయారని.. అందుకే మరో నెల రోజుల్లో ఆయన సినిమా వస్తుందనే బజ్ కూడా లేదని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' సినిమా ఎలాంటి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.