ట్రెండీ టాక్‌: ప‌వ‌న్ ఏమో అలా.. వెంకీ ఏమో ఇలా!

Update: 2021-03-03 03:30 GMT
రీమేక్ ని తెర‌కెక్కించ‌డం అంటే ఆషామాషీ కాద‌ని చెబుతుంటారు. అప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ఒరిజినల్ వెర్ష‌న్ తో పోలిక చూస్తూ అంతా విమ‌ర్శిస్తారు. అందుకే ఈ స‌వాల్ ని స్వీక‌రించేందుకు ద‌ర్శ‌కులు సాహ‌సం చేయ‌రు. కొన్ని క్లాసిక్ సినిమాల్ని అయితే ట‌చ్ చేసేందుకే ఝ‌డుస్తారు.

కానీ విక్ట‌రీ వెంక‌టేష్ .. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్లు ఇటీవ‌లి కాలంలో రీమేక్ మూవీల‌పై ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం హాట్ టాపిక్ గా మారింది. ప‌వ‌న్ న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ పింక్ చిత్రానికి రీమేక్. మాతృక‌తో పోలిస్తే తెలుగు వెర్ష‌న్ లో చాలా మార్పులు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న రీమేక్ చిత్రం నార‌ప్ప లో మాత్రం ఒరిజిన‌ల్ కి మ‌క్కీ మ‌క్కీ దించేస్తున్నార‌ని తెలుస్తోంది. ధ‌నుష్ న‌టించిన త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ అసుర‌న్ కి రీమేక్ ఇది. అందులో ధ‌నుష్ పోషించిన పాత్ర‌ను వెంకీ పోషిస్తున్నారు. అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరంభం ప‌లువురు యువ అగ్ర దర్శకులకు అసుర‌న్ సినిమాని చూపించి తెలుగైజ్ చేయ‌మ‌ని నిర్మాత‌ కోరారు.

చివ‌ర‌కు శ్రీ‌కాంత్ అడ్డాల వారిలో ఫైన‌ల్ అయ్యారు. అనంత‌రం నారప్ప టైటిల్ ని ఎంపిక చేసి ఒరిజినల్ లో మార్పులు చేయ‌కుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. స్క్రిప్ట్ ప‌రంగా ఒక్క మార్పు కూడా చేయలేదని తెలిసింది. ఈ చిత్రం పూర్తిగా అసురన్ కి మ‌క్కీకి మ‌క్కీ అని తెలుస్తోంది.

చివ‌రికి ఒరిజినల్ నుండి రిఫరెన్స్ షాట్లను కూడా తీసుకున్నార‌ట‌. అసురన్ చిత్రీకరించిన తమిళనాడులోని ఒక గ్రామంలో యాక్షన్ ఎపిసోడ్లు కూడా రెడీగా యూజ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రధాన నటుల పోరాటంతో సాగుతుంది. ఒరిజిన‌ల్ నుంచే వీట‌న్నిటినీ తీసుకుని ముందుకు సాగాలని వెంకటేష్- సురేష్ బాబు నిర్ణయించుకున్నారట‌.

ఇందులో వెంకీ భార్య పాత్ర‌లో జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియమణి న‌టిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్- వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ రీమేక్ మూవీ వ‌కీల్ సాబ్ .. వెంకీ రీమేక్ మూవీ నార‌ప్ప ల‌పై ఫిలింస‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ ఇద్ద‌రూ ఇంత‌కుముందు గోపాల గోపాల చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News