చ‌ర‌ణ్ `జెర్సీ` డైరెక్ట‌ర్ ని దించాల్సిందే?

Update: 2021-11-09 04:30 GMT
పాన్ ఇండియా చిత్రం RRR  రిలీజ్ త‌ర్వాతా చ‌ర‌ణ్ వ‌రుస‌గా పాన్ ఇండియా ద‌ర్శ‌కుల‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో సినిమాకి క‌మిట‌య్యారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. శంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ఆశ‌ప‌డ్డారు. `ఆర్.ఆర్.ఆర్` లాంటి భారీ పాన్ ఇండియా స‌క్సెస్ కొట్టిన వెంట‌నే మ‌రో పాన్ ఇండియా సినిమాతో ఆడియ‌న్స్ లోకి వెళితే  క్రేజ్ నాలుగింత‌లు  అవుతుంద‌ని చ‌ర‌ణ్ ప్రీ ప్లాన్డ్ గా శంక‌ర్ ని రంగంలోకి దించారు. కానీ ఇప్పుడు చ‌ర‌ణ్ ప్లాన్ త‌ల్ల‌కిందుల‌య్యేట్లు క‌నిపిస్తోంది. `భార‌తీయుడు-2` కి కోర్టు  క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంతో డిసెంబ‌ర్ నుంచి ఆ సినిమా బ్యాలెన్స్  షూటింగ్  చేయాల్సిన బాధ్య‌త శంక‌ర్ పై ఉంది. ఇంకా 100 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.

మ‌రోవైపు ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌ర్భవ‌తి. ఆమె డేట్ల స‌మ‌స్య కూడా త‌లెత్త‌నుంది. మునుప‌టిలా సుల‌భంగా షూట్ లో పాల్గొనే స్కోప్  లేదు. ఆమె వెసులుబాటుని బ‌ట్టి షూట్ ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది.  అటుపై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. ఇలా ఏ కోణంలో చూసినా  శంక‌ర్ ఇప్ప‌ట్లో ఫ్రీ అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ తో  శంక‌ర్ తెర‌కెక్కించాల్సిన ఆర్.సి15 పెండింగ్ లో పడింది. ఈ నెల‌లోనే ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇంకా మేజ‌ర్ షెడ్యూల్ లోకి వెళ్ల‌లేదు. ఇంత‌లోనే `భార‌తీయుడు-2` డిసెంబ‌ర్లో మొద‌ల‌వ్వాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ సినిమా కి బ్రేక్ వేయ‌క‌ త‌ప్ప‌ద‌ని దాదాపు ఖ‌రారైపోయింది. మ‌రి ఇప్పుడు చ‌ర‌ణ్ ముందు ఉన్న‌ ప్లాన్ బీ ఏంటి? అంటే యంగ్ మేక‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరిని బ‌రిలోకి దించాల్సిందేన‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే గౌత‌మ్ తో చ‌ర‌ణ్ 16వ చిత్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  `జెర్సీ` సినిమాతో స‌క్సెస్ అందుకున్న గౌత‌మ్ ఇప్పుడు బాలీవుడ్ లో అదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. దాదాపు ఆ సినిమా షూట్ కూడా  పూర్త‌యింది. మ‌రి కొన్ని రోజుల్లో ఆయ‌న ఫ్రీ అయిపోతారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ 16వ చిత్రాన్ని గౌత‌మ్ తో  లాంచ్ చేసి ముందుకు వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.  అయితే చ‌ర‌ణ్ ఇప్ప‌టికి శంక‌ర్ ని మిస్స‌యినా కానీ గౌత‌మ్ తిన్న‌నూరి కూడా జాతీయ స్థాయి సినిమా చేస్తున్నాడు కాబ‌ట్టి అత‌డికి కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అది చ‌ర‌ణ్ కి కలిసొస్తుంది.        
Tags:    

Similar News