ఇంతకీ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ ఎవరు చేస్తారబ్బా?!

Update: 2021-10-04 02:30 GMT
మొదటి నుంచి కూడా తెలుగులోకి తమిళ సినిమాలు ఎక్కువగా రీమేక్ అవుతూ వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో మలయాళ రీమేకుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ రీమేకులకు మంచి ఆదరణ లభిస్తూ ఉండటంతో, వీటి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం చిరంజీవి మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్'కి రీమేక్ గా 'గాడ్ ఫాదర్' చేస్తున్నారు. ఇక 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆమె మలయాళ సినిమా కి రీమేక్ గా పవన్ 'భీమ్లా నాయక్' చేస్తున్నారు. ఇక వెంకటేశ్ ఆల్రెడీ 'దృశ్యం 2' చేసేసి, విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇలా చాలామంది హీరోలు మలయాళ రీమేకుల చేస్తున్నారు. టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న మలయాళ మూవీస్ రీమేక్ లలో, తాజాగా 'డ్రైవింగ్ లైసెన్స్' పేరు కూడా చేరిపోయింది. మలయాళంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో 'డ్రైవింగ్ లైసెన్స్' ఒకటిగా నిలిచింది. లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ .. సూరజ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ రెండు పాత్రలలో ఏ పాత్రకి ఉండవలసిన ప్రాధాన్యత ఆ పాత్రకి ఉంటుంది. కథ అనూహ్యమైన మలుపులతో సాగుతుంది. అందువలన ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ ఉందని చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్ వారు ఈ సినిమా రీమేక్ విషయంలో మరింత ఉత్సాహంగా ఉన్నారు. బాలీవుడ్ రీమేక్ లో .. అక్షయ్ కుమార్ ..ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఇక తెలుగులో ఈ సినిమా రీమేక్ లో పవన్ - చరణ్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత పవన్ - రవితేజ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెప్పుకున్నారు. కానీ ఆ తరువాత ఏ వైపు నుంచి అందుకు సంబంధించిన ముచ్చట లేదు .. ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

మలయాళ సినిమాల్లో కథ వాస్తవికతను దాటి వెళ్లదు. కథనం విషయంలో వాళ్లు చేసే కసరత్తు ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కథ ఎక్కువ .. ఖర్చు తక్కున అన్నట్టుగా ఆ సినిమాలు రూపొందుతాయి. భారీ డైలాగులకంటే భావాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. యాక్షన్ కంటే ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువలన మలయాళ సినిమాలు మనసుకు దగ్గరగా వెళతాయి. ఈ కారణంగానే హీరోలు .. దర్శక నిర్మాతలు ఈ సినిమాల రీమేకులు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. తెలుగులో 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ కావడం మాత్రం ఖాయం. కాకపోతే ఎప్పుడు అవుతుంది .. ఎవరితో అవుతుంది? అనేదే చూడాలి.
Tags:    

Similar News